సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మోసాల గురించి పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొంత మంది ప్రజలు మాత్రం మోసగాళ్లకు బలవుతూనే ఉన్నారు. కేటుగాళ్ల చేతుల్లో పడి బాధితులు నిండా మునిగిపోతున్నారు. రోజురోజుకు కొంత పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను సులభంగా మోసం చేస్తున్నారు. బ్యాంకు అధికారులమని చెప్పి నమ్మించి ఖాతా వివరాలు, రహస్య నెంబర్ గురించి తెలుసుకుని ఖాతాలోని నగదును మాయం చేస్తున్నారు. ఇటీవల డిజిటల్ లావాదేవీలు పెరగడం వల్ల చాలామంది వాలెట్లు, యూపీఐల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు.
వాలెట్ స్తంభించి పోతుందని..
దానిని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు.. 24 గంటల్లో కేవైసీ అప్డేట్ చేసుకోవాలని లేకపోతే వాలెట్ స్తంభించి పోతుందని సందేశం పంపుతున్నారు. సదరు నెంబర్కు ఫోన్చేస్తే లింకు పంపించి అందులో వివరాలు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరికొంత మంది నేరగాళ్లేమో క్విక్ సపోర్ట్, ఎనీ డెస్క్, టీం వ్యూవర్ వంటి రిమోట్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. ఆ తర్వాత కనీసం 10 రూపాయలను ఖాతాలో జమ చేసుకోవాలని ఖాతాదారుడికి సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఖాతాదారుడు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు, రహస్య నెంబర్ అన్ని నమోదు చేసే సమయంలో రిమోట్ ద్వారా సైబర్ నేరగాళ్లు వివరాలను మొత్తం తెలుసుకుంటున్నారు. ఇలా అమాయకులను పలు రకాలుగా మోసం చేస్తున్నారు.