స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేసుకుంటే కరెంటు వినియోగం వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశముంటుందని ‘రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి’(ఈఆర్‌సీ) స్పష్టం చేసింది. వీటిపై ఈఆర్‌సీ ప్రత్యేకంగా దృష్టిసారించింది.
వీటిని దేశవ్యాప్తంగా, వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలని విద్యుత్‌శాఖ కూడా యోచిస్తోంది. కానీ స్మార్ట్‌మీటరు పెట్టాలంటే ప్రజలకు ఖర్చు లేకుండా 'విద్యుత్ పంపిణీ సంస్థ'(డిస్కం) భరించాలనే ప్రతిపాదనలున్నాయి. ఈ నిధులను కేంద్రమే ఇవ్వాలని డిస్కంలు కోరుతున్నాయి. స్మార్ట్‌మీటర్ల పనితీరు, వాటివల్ల కలిగే లాభాలపై రాష్ట్ర ఈఆర్‌సీ అధ్యయనం చేసి నివేదిక తయారుచేసినట్లు ఈఆర్‌సీ ఛైర్మన్ టి.శ్రీరంగారావు తెలిపారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలివే..
- స్మార్ట్‌మీటరు పెడితే రీడింగ్ నమోదుకు విద్యుత్ సిబ్బంది ఇళ్లకు రానవసరంలేదు. మీటరు రీడింగ్ ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదవుతోంది.
- వినియోగదారుడి సెల్‌ఫోన్‌లో స్మార్ట్‌మీటరు యాప్ పెట్టుకుంటే రీడింగును ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. దీనిని గమనిస్తూ కరెంటు వాడకాన్ని, వృథాను తగ్గించుకోవచ్చు.
- గరిష్ఠ డిమాండు లేని సమయాల్లో కరెంటు వాడుకుంటే తక్కువ ఛార్జీ పడుతుంది.ఏ సమయంలో వాడుకుంటే రీడింగ్ తగ్గుతుందనేది తెలుస్తుంది.