తెలంగాణ

telangana

ETV Bharat / state

సరికొత్త కథలను అందించే దిశగా ప్రయత్నం... స్క్రీన్​ప్లే రచనపై శిక్షణ - తెలంగాణ తాజా వార్తలు

తెలుగు తెరకు సరికొత్త కథలను అందించేందుకు భాషా సాంస్కృతిక శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. థియేటర్‌కు ప్రత్యామ్నాయంగా అనేక వేదికలు పుట్టుకొచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న వేళ... దేశంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌ ద్వారా సినిమా స్క్రిప్ట్ రైటింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. ప్రముఖ దర్శకులతో శిక్షణ ఇప్పిస్తూ వాస్తవిక కథలను తయారుచేసేలా ఔత్సాహికులను సిద్ధం చేస్తోంది.

సరికొత్త కథలను అందించే దిశగా ప్రయత్నం
సరికొత్త కథలను అందించే దిశగా ప్రయత్నం

By

Published : Mar 1, 2021, 5:34 AM IST

సరికొత్త కథలను అందించే దిశగా ప్రయత్నం

ప్రేక్షకులకు వినోదాన్నే కాదు సమాజంలో మార్పునకు కారణమయ్యే శక్తిమంతమైన మాధ్యమం సినిమా. కథే కథానాయకుడవుతున్న వేళ... మంచి కథలకు డిమాండ్ పెరిగింది. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడటం, ఓటీటీల వైపు దృష్టి సారించడం వల్ల కొత్త కథలు ప్రేక్షకులను పలకరించాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ వేదికగా ఔత్సాహిక రచయితలకు సినిమా కథ, స్క్రీన్ ప్లే రచనపై శిక్షణకు... తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ శ్రీకారం చుట్టింది.

ప్రముఖులచే శిక్షణ

ఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ థియేటర్ ఆధ్వర్యంలో 9 వారాలపాటు సుమారు 100 గంటలు ఆన్‌లైన్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్, ఎన్.శంకర్, దశరథ్ లాంటి 18 మంది ప్రముఖులతో సినిమా రచన, స్క్రీన్ ప్లే తోపాటు బడ్జెట్‌కు అనుగుణంగా కథ ఎలా చెప్పాలనే విషయాలపై సుదీర్ఘంగా శిక్షణ ఇచ్చారు. దేశ నలుమూలల నుంచి సుమారు 400 మందికిపైగా ఈ ఆన్‌లైన్ శిక్షణకు హాజరయ్యారు.

రచనపై అవగాహన పెరిగింది

ఖాజా పాషా, చిలకమర్రి నటరాజ్, డీఎస్​ కన్నన్‌ల పర్యవేక్షణలో 9 వారాలపాటు ఈ స్క్రిప్ట్ రైటింగ్ శిక్షణ సాగింది. కథ రాసే విధానంతో పాటు విదేశీ చిత్రాల్లో ఎలాంటి కథలు చెబుతున్నారు, వారు ఎంచుకున్న విధానాలేంటో వీడియోల రూపంలో ప్రదర్శిస్తూ ఔత్సాహిక రచయితలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా కథా రచనపై ఎంతో అవగాహన పెరిగిందని పలువురు పేర్కొన్నారు.

ఓ చక్కని వేదిక

మూస ధోరణిలో సాగే సినిమా కథలను కాకుండా పరిసరాల్లోని విషయాలను ఒడిసిపడితే చక్కటి కథలు తయారవుతాయంటోన్న నిపుణులు... కెమెరాను మీ వైపు తిప్పుకునేలా చేయాలంటున్నారు. గ్రామీణ ప్రాంత కథలు రాయడం నేర్చుకోవాలనుకునే వారికి ఈ కార్యశాల చక్కటి వేదికగా నిలుస్తుందని చెబుతున్నారు.

పదిమందికి అవకాశాలు

యువతరాన్ని నవ్యమైన కథల వైపు మళ్లించడమే లక్ష్యంగా మొదలుపెట్టిన ఈ స్క్రిప్ట్ రైటింగ్ కార్యశాల తొలిప్రయత్నంలో విజయవంతమయ్యామని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. 9 వారాలపాటు నిర్వహించిన ఈ శిక్షణలో 10 మందికి ఓటీటీల్లో కథలకు అవకాశాలు దొరికాయని స్పష్టం చేశారు.

త్వరలో దర్శకత్వ శాఖలోను..

ప్రస్తుతం సినిమా కథా రచనలో తొలి దఫా కార్యశాలను పూర్తి చేసిన భాషా సాంస్కృతిక శాఖ.. మరికొంత మందికి రెండో దఫాలో 9 వారాలపాటు శిక్షణ మొదలుపెట్టింది. సినిమా రచనలో శిక్షణ పూర్తైన వారికి త్వరలోనే దర్శకత్వ శాఖలోనూ ఉచితంగా శిక్షణ ఇవ్వబోతున్నారు.

ఇదీ చూడండి:'ఫీజు వేధింపులు ఆపకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం'

ABOUT THE AUTHOR

...view details