ఉల్లిగడ్డల ధర సామాన్యులను కలవర పెడుతోంది. రోజురోజుకి పెరుగుతున్న ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. హైదరాబాద్ మలక్‌పేట్ మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిగడ్డల టోకు ధర క్వింటా 6వేల రూపాయలకు చేరింది. గత నెలలో గరిష్ఠ ధర 1971 రూపాయలు ఉండేది. ఈ నెలలో ఏకంగా 201 శాతం అదనంగా పెరిగింది. ఇక చిల్లర ధరలను వీధికో తీరుగా అమ్ముతున్నారు.
కిలోకు రూ.80
హైదరాబాద్‌కు మహారాష్ట్ర నుంచి వచ్చే నాణ్యమైన పెద్ద ఉల్లిగడ్డల ధర 60 రూపాయలు పలుకుతోంది. చిన్నగా ఉండి అంతగా నాణ్యత లేని వాటిని కూడా కిలో 30రూపాయలకు అమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చిల్లర కిలో కు 80 రూపాయలకు చేరిందని జాతీయ ఉద్యాన మండలి తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఉల్లి ధరల మంటతో విదేశాల నుంచి లక్ష టన్నుల దిగుమతి చేయడమే గాక వాటి నిల్వకు నాణ్యత ప్రమాణాలను సడలించింది.