రెవెన్యూ శాఖలో పదోన్నతుల కసరత్తు కొనసాగుతోంది. శాఖ అధికారులు, ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రెవెన్యూ శాఖ పదోన్నతులపై కొనసాగుతోన్న సర్కార్ కసరత్తు
రాష్ట్రంలోని రెవెన్యూ శాఖలో పదోన్నతులపై సర్కార్ కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే... రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితా సిద్ధమైంది.
ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితాను సిద్ధం చేసిన రెవెన్యూ శాఖ... తాజాగా ఆ పైస్థాయి పోస్టుల పదోన్నతుల ప్రక్రియపై దృష్టి సారించింది. డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, సీసీఎల్ఏ సూపరింటెండెంట్లు, సచివాలయ విభాగాధిపతుల సీనియార్టీ జాబితాను సిద్ధం చేయాలని రెవెన్యూశాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు.
వారిపై ఉన్న క్రమశిక్షణా చర్యలు, విచారణలు, పెండింగ్లో ఉన్న ఇతర అంశాల వివరాలు కూడా అందించాలని స్పష్టం చేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ పోస్టుల ఖాళీలను అంచనా వేయాలని సీఎస్ తెలిపారు. రెండు కేటగిరీల్లోనూ ఎస్సీ, ఎస్టీ అధికారుల ప్రాతినిధ్యంతో పాటు అభ్యర్థుల వివరాలను కూడా అందించాలని సూచించారు. అత్యంత ప్రాధాన్యకర అంశంగా పరిగణించి వీలైనంత త్వరగా వివరాలు అందించాలని సోమేష్ కుమార్ ఆదేశించారు.