Sri Rama Shobhayatra: భాగ్యనగరంలో శ్రీరామ శోభాయాత్ర కొనసాగుతోంది. భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ టేక్డీ వరకు సాగనుంది. ధూల్‌పేట, జాలీ హనుమాన్, చుడీబజార్ మీదుగా సాగి... రాత్రి 8 గంటలకు ముగియనుంది. రెండేళ్ల తరువాత హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర జరుగుతోంది. కరోనా మహమ్మారి వల్ల గత రెండేళ్లు శ్రీరామ శోభాయాత్ర నిర్వహించలేదు. ఈసారి ఎలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల అట్టహాసంగా శోభాయాత్రను నిర్వహిస్తున్నారు.
శోభాయాత్ర మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించి... సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు అమలు:శ్రీరామనవమి శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శోభాయాత్ర సమయంలో ఆయా రహదారుల మీదుగా వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. వాహనాలను దారి మళ్లించి ఇతర రహదారుల మీదుగా వెళ్లేలా చూస్తున్నారు. గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆంక్షలు విధించారు. బోయగూడ కమాన్, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ చత్రి, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకుంటుంది.
ఆయా మార్గాల్లో శోభాయాత్ర ముగిసిన వెంటనే... బారికేడ్లు తీసి వాహనాల రాకపోకలకు అనుమతించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు శోభాయాత్రకు సంబంధించిన సమాచారం కోసం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నెంబర్ 040 2785 2482, హెల్ప్ లైన్ 9010203626 నంబర్లకు ఫోన్ చేయాలని... హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు పేరిట సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.