ఏపీలో ఏలూరు వింత వ్యాధిపై జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నా... నిర్దిష్టమైన కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించేలోగా... అందులో టాక్సిక్ ప్రభావం తగ్గి ఉంటుందని సీనియర్ వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కేసులు తగ్గుతుండడం మంచి పరిణామమే అయినా... కారణాలు తెలియకపోవడం మాత్రం ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు. శుక్రవారం నాటికి 610 కేసులు రికార్డైనట్లు చెప్పిన ఏపీ అధికారులు... మూర్ఛ వల్ల రోగులు కాళ్లు , చేతులు తీవ్రంగా కొట్టుకుంటున్నారని తెలిపారు..
16న పూర్తి నివేదిక..!
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, దిల్లీ ఎయిమ్స్ , ఎన్ఐఎన్ సంస్థలు ఇచ్చిన నివేదికలో రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ లాంటి భార లోహాలు ఉన్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రక్త నమూనాల్లో ఆర్గానో ఫాస్పెట్స్ ఉన్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పేర్కొంది. దీనిపై మరింత లోతైన విశ్లేషణ అవసరమని ఆ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. రోగుల రక్తంలో ఆర్గానో ఫాస్పెట్స్, ఆర్గానో క్లోరిన్ లాంటి పదార్థాలు ఉండటంపై ఎయిమ్స్ సంస్థ మరింత పరిశోధన చేస్తున్నట్లు తెలిపింది. దిల్లీకి పంపిన 40 యూరిన్ నమునాల్లో రెండింటిలో మాత్రమే నికెల్, సీసం ఆనవాళ్లు గుర్తించిన్నట్లు అధికారులు తెలిపారు.
ఎయిమ్స్‌తో పాటు... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధనలో... నీటి నమునాల్లో ఎలాంటి లోపాలు లేవని తెలిసింది. నీటి నమూనాల పూర్తి విశ్లేషణకు ఈ నెల 14 వరకు సమయం పడుతుందని ఎన్ఐఎన్ వెల్లడించింది. ఏలూరు నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న తాగునీరు సురక్షితంగా నే ఉందని... ప్రజలు నిరభ్యంతరంగా వీటిని వినియోగించవచ్చని తెలిపారు. కూరగాయల నమునాల్లో కలుపు మొక్కల నివారణకు వినియోగించే మందుల అవశేషాలను ఎన్ఐఎన్ కనుగొంది. బియ్యం, మాంసం, చేపలు, మట్టి తదితర నమూనాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఫలితాలు 16 వ తేదీ నాటికి వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.