కృష్ణా బేసిన్‌లో నిండు కుండల్లా జలాశయాలు
09:07 August 27
కృష్ణా బేసిన్‌లో నిండు కుండల్లా జలాశయాలు
శ్రీశైలం నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి కృష్ణమ్మ పరుగులు మళ్లీ మొదలయ్యాయి. శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2,26,751 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,54,434 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు ఉండగా.. పూర్తి నీటి మట్టం 885 అడుగులు ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 214.363 టీఎంసీలు కాగా.. పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 2,20,43 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2,20,143 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 309.34 టీఎంసీలుగా నమోదైంది.
జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జలాశయం 26 గేట్లు ఎత్తారు. ఇన్‌ఫ్లో 2.15 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1044 అడుగులు ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ 9.35 టీఎంసీలుగా నమోదైంది.