తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద జోరు - Lifting of Saraswati Barrage Gates

శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. ఆలమట్టికి వరద తగ్గినా దిగువకు 1.32లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌, జూరాల జలాశయాలకు ప్రవాహం కొనసాగుతోంది.

Ongoing flooding in Srisailam
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద జోరు

By

Published : Aug 15, 2020, 6:57 AM IST

జూరాల నుంచి 17 గేట్లు ఎత్తి 1.12లక్షలు, విద్యుదుత్పత్తి ద్వారా 29వేల క్యూసెక్కులు దిగువకు పంపుతున్నారు. మరోవైపు తుంగభద్ర జలాశయం నీటితో కళకళలాడుతోంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 1633కి గాను 1630.63 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం కాల్వలకు 9187 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రికి తుంగభద్ర జలాశయం గేట్లు తెరవనున్నట్లు సమాచారం.

నిండు గోదావరి ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీ దిగువన బంగాళాఖాతం పాలవుతోంది. 10,150 క్యూసెక్కులను కాల్వలకు వదలుతుండగా 7.77 లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం శుక్రవారం రాత్రి 9గంటలకు 39.7 అడుగులకు చేరింది. పర్ణశాల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. తాలిపేరు జలాశయంలో 23 గేట్లు ఎత్తి 1.28లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరికి విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారంవద్ద గురువారం ద్విచక్రవాహనంపై పోతుల్వాయి వాగు దాటే ప్రయత్నంలో ప్రవాహంలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

  • ములుగు జిల్లాలో మూడు రోజులుగా భారీవర్షాలతో వరద నీరు రహదారులు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది.ములుగు-జంగాలపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి సగం నీటిలో మునిగిపోయింది.

లక్ష్మీ పంపుహౌస్‌ నుంచి దిగువకు విడుదల

లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. సరస్వతి బ్యారేజీ గేట్లను ఎత్తడంతో లక్ష్మీ బ్యారేజీకి వరద మరింత పెరగనుంది. శుక్రవారం బ్యారేజీ నుంచి 2,42,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి 2,91,200 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. ప్రస్తుతం బ్యారేజీలో 8.06 టీఎంసీల నీరుంది.

సరస్వతి బ్యారేజీ గేట్ల ఎత్తివేత

వరద ఉద్ధృతి పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతి(అన్నారం) బ్యారేజీ గేట్లను శుక్రవారం ఎత్తివేశారు. 26,000 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తోంది. లక్ష్మీ పంపుహౌస్‌ నుంచి ఆరు రోజులపాటు గోదావరి జలాలను ఎత్తిపోయడంతో సరస్వతి బ్యారేజీకి 8.27 టీఎంసీల జలాలు తరలాయి.కాళేశ్వరం వద్ద ప్రాణహిత ప్రవాహం నిలకడగా ఉంది. శుక్రవారం 8.320 మీటర్ల నీటిమట్టంతో పుష్కరఘాట్‌ను తాకుతూ దిగువకు ప్రవహించింది. లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్‌ వద్ద 1.95 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది.

నేడు అతి భారీ వర్షాలు

రుతుపవనాల ప్రభావంతో శనివారం రాష్ట్రంలో అక్కడక్కడ అతి భారీగా, ఆదివారం భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ 36 గంటల వ్యవధిలో అత్యధికంగా 30.2, మంగపేటలో 27.8, పేరూరులో 22.1, తాడ్వాయిలో 21.9 సెంటీమీటర్ల వర్షం పడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ వెంకటాపురంలో 11 గంటల వ్యవధిలోనే ఏకంగా 12.6, మంగపేటలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీవర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి.

ABOUT THE AUTHOR

...view details