గులాబ్ తుపాన్ బీభత్సంతో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది నిండుకుండలా మారింది. వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ తర్వాత తనలో ఈసీ నదిని కలుపుకొని గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 50 కిలోమీటర్ల పైనే ప్రవహిస్తోంది. మూసీ, ఈసీలపై జంటజలాశయాలను నిర్మించారు. చివరికి మూసీ కృష్ణా నదిలో కలుస్తుంది. గతేడాది అక్టోబరులో కురిసిన వానలకు కూడా మూసీ ఉద్ధృతం (Musi River in Spate)గా ప్రవహించింది. ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు జంటజలాశయాలు నిండటంతో మూసీలోకి వరద నీరు విడిచిపెడుతున్నారు. రెండు జలాశయాలకు భారీగా వరద చేరుతుండటంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరాయి.
- హిమాయత్‌సాగర్ జలాశయానికి వరద నీటిని తెచ్చే ఈసీ వాగు ఉరకలెత్తి పారుతోంది. మొయినాబాద్ మండలం వెంకటాపూర్ వద్ద ఈసీ వాగులో వరద ఉప్పొంగి ప్రవహించగా, అమ్డాపూర్ సమీపంలో పంట పొలాలను ముంచెత్తింది.
- జియాగూడ, పురానాపూల్‌ల వద్ద వంద ఫీట్ల బైపాస్ రోడ్డుపైకి నీరు చేరింది. దీంతో హనుమాన్ దేవాలయం, శివాలయం నీట మునిగాయి.
- గండిపేట, హిమాయత్ సాగర్ వరద గోల్నాక వద్దకు చేరగా అక్కడ హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే నీరు మూసీలో కలుస్తోంది.
- మూసారాంబాగ్ వద్ద వంతెనపై నుంచి వరద పారుతోంది. ముందు జాగ్రత్తగా ఇక్కడా ట్రాఫిక్ నిలిపేశారు.
- జంట జలాశయాల నుంచి మూసీ నదిలోకి భారీగా వరద చేరుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. నది పరీవాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
బస్తీలు, కాలనీల్లో అప్రమత్తం...
ఎప్పటి నుంచో మురికి కూపంగా మారిన మూసీ నదిలో వరద నీరు వచ్చి చేరుతుండటంతో మురుగు అంతా కొట్టుకుపోయి కొంతరూపు సంతరించుకుంటోంది. అదే సమయంలో ఉద్ధృతంగా ప్రవహించడంతో చుట్టూ పక్కల బస్తీలు, కాలనీలు బిక్కు బిక్కుమంటున్నాయి. చాదర్‌ఘాట్ వద్ద చిన్న వంతెనను తాత్కాలికంగా మూసివేశారు.
పురానాపూల్ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో దహనవాటిక, శ్మశానం మునిగిపోయాయి. ధోబీఘాట్‌లు కొట్టుకుపోయాయి. మేకలమండి, గోషామహల్ రహదారి, కేశవస్వామినగర్, పురానాపూల్ తదితర ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. స్థానికులు లెవరూ దగ్గరకు రాకుండా పోలీసులు పహరా ఏర్పాటు చేశారు. మూసీలోకి ఎవరూ దిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. చాదార్‌ఘాట్ వద్ద ఓ మృతదేహం కొట్టుకురావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాగోలు వద్ద ఒక ఆవు చిక్కుకు పోవడంతో అత్యవసర బృందాలు రంగంలోకి దిగి రక్షించాయి.