తెలంగాణ

telangana

ETV Bharat / state

'పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దు '

అప్పులు ఉన్నాయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆపగలమా అని ఎర్రమంజిల్ భవనం కూల్చివేయద్దన్న పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. మంత్రి మండలి తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు ఎలా జోక్యం చేసుకోవచ్చునో చెప్పాలని ప్రశ్నించింది. పిటిషనర్లు తమకు తాము నిజాంలాగా భావించి వాదించవద్దని సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

By

Published : Aug 1, 2019, 10:13 PM IST

'పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దు '

నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్​లో భవనాలను కూల్చివేయవద్దంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఇవాళ కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. అసెంబ్లీ నిర్మాణం అత్యవసరం కాదని... ఎర్రమంజిల్ వారసత్వ భవనాలను కూల్చకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు హెరిటేజ్ కమిటీలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. అసెంబ్లీ నిర్మించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని... ఆ ప్రక్రియలో చట్ట ఉల్లంఘనలు ఉంటే వివరించాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. మంత్రిమండలి తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందా తెలపాలని పేర్కొంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.

అప్పులు ఉన్నాయని...అభివృద్ధి ఆపాలని చెప్పగలమా..!

తెలంగాణకు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వివరించారు. అప్పులు ఉన్నాయని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆపాలని చెప్పగలమా అని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణతో పాటు భారత దేశానికి కూడా కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని... అలాగని కేంద్రం కూడా అభివృద్ధి చేయవద్దని అనగలమా అని వ్యాఖ్యానించింది.

యువ న్యాయవాదులు హుందాగా వాదించాలి...

పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనల పట్ల ఓ సందర్భంలో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్లు తమకు తాము నిజాంలా భావించుకోవద్దని సూచించింది. న్యాయవాదులు పార్లమెంటులోనో.. బహిరంగ సభల్లోనో మాట్లాడినట్లుగా న్యాయస్థానంలో వ్యవహరించవద్దని వ్యాఖ్యానించింది. న్యాయవాదులు కేసుకు సంబంధించి మాత్రమే చట్ట పరిధిలో వివరించాలని తెలిపింది. యువ న్యాయవాదులు హుందాగా.. న్యాయవ్యవస్థ గౌరవంను నిలబెట్టేలా... చట్టపరమైన ఉన్నత పదజాలంతో వాదిస్తే.. భవిష్యత్తు ఉంటుందని హైకోర్టు హితవు చెప్పింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

'పిటిషనర్లే నిజాంలాగా భావించుకొని వాదించొద్దు '

ఇదీ చూడండి: 'కొత్త అసెంబ్లీని నిర్మించుకుంటే తప్పేంటి..?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details