రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదై మార్చి 2(మంగళవారం)తో ఏడాది అవుతుంది. ఈ సంవత్సర కాలంలో కొవిడ్ అనేక పాఠాలు నేర్పింది. ఎన్నడూ ఎరుగని కొత్త అలవాట్లను సాధారణ జీవనంలో కచ్చితంగా ఆచరించేలా చేసింది. ముఖానికి మాస్కు లేకుండా బయటకు రావద్దని చెప్పింది. ఏది తాకినా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని గుర్తుచేసింది. గుంపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. గడిచిన ఏడాదిలో ఇందులో కొన్ని పాటించారు. ఎక్కువ వదిలేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 27, 2021 నాటికి కేసుల సంఖ్య 2,98,807కు పెరిగింది. ప్రధానంగా గత మూడు నెలలుగా వైరస్ వ్యాప్తి నెమ్మదించింది. అయినా రెండో ఉద్ధృతి వస్తుందేమోననీ, యూకే వైరస్, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ విరుచుకుపడుతాయేమోననీ.. ఇలా పలు ఆందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి.
మళ్లీ ముప్పు..
ఈ క్రమంలో గత ఏడాదిలో కొవిడ్ టీకా రావడం మరో అద్భుతమైన ఘట్టమే. కొద్దిరోజులుగా జీహెచ్‌ఎంసీలో, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, సంగారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, తదితర జిల్లాల్లో స్వల్పంగా కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది. అజాగ్రత్తగా ఉంటే మరోసారి వైరస్ తీవ్రత పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వీయ నియంత్రణ, టీకాలే మున్ముందు కొవిడ్ నుంచి రక్షణనిస్తాయని సూచిస్తున్నారు. గత ఏడాది కొవిడ్ నివారణకు చేపట్టిన చర్యలపై ఆరోగ్యశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.