ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాణాలు నిలబెడతాయనుకుంటే.. ఇప్పుడు ప్రాణాలు తీసేస్తున్నాయి. కొన్ని చోట్ల సౌకర్యాలు లేక రోగులు చనిపోతుంటే.. మరికొన్ని చోట్ల కళ్లముందే ప్రాణాలు వదులుతున్న కనికరించే నాథుడే లేకుండా పోయారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం దొరుకుతుందని ఆశగా వెళ్తే.. వారి కళ్లముందే అయినవాళ్ల ప్రాణం పోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రులు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. రోగులపట్ల వైద్యులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు.
ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడి వైద్యులు ఆ వ్యక్తిని పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి ఆవరణలో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ధర్మవరానికి చెందిన రాజా తెల్లవారుజామున ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అతని భార్య, గర్భిణీ అయిన అతని కూతురు నిస్సహాయ స్థితిలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత వైద్యులు ఎవరు కనీసం వార్డులోకి కూడా రానివ్వకపోవడంతో.. వారు రోడ్డుమీద కూర్చుండి పోయారు. తన భర్తకు ఊపిరాడక అల్లాడిపోతున్నాడని వైద్యుల్ని ఎంత ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో భార్య ఒడిలొనే భర్త కన్నుమూసాడు.