ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా.. 'వన్‌లైఫ్' సమాజంలో ప్రస్తుతం ఎటుచూసినా, విన్నా పట్టిపీడిస్తున్న సమస్య... ఆత్మహత్య. జయాపజయాలు, కుటుంబ కలహాలు, మానసిక, ఆరోగ్య సమస్యలు, ఇలా... కారణం ఏదైనా అంతిమంగా ముప్పు మాత్రం ప్రాణానికే. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా 8 లక్షల మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా... 90 ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారూ ఆత్మహత్యలతో తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఒకరు బలవన్మరణానికి పాల్పడితే ఆ ప్రభావం వారి పిల్లలు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములతో పాటు తనపై ఆధారపడిన వారందరిపై పడుతుంది. క్షణికావేశంలో తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలకు ఎంతోమంది దిక్కులేనివారవుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బాధితుల్లో ఎంతో మందిపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఐదుగురు వాలంటీర్లతో..
సమాజాన్ని వేధిస్తున్న ఈ సమస్యకు పరిష్కార అంశంగా ఎంచుకున్న 31 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేష్ భరద్వాజ్... తన మిత్రుడు విక్రాంత్ సహకారంతో 'వన్ లైఫ్ అనే సొసైటీ'ని 2015 లో ప్రారంభించారు. ఐదుగురు కౌన్సిలర్లు, వాలంటీర్లతో ప్రారంభమైన ఈ సొసైటీ ఇప్పుడు 54 మందికి విస్తరించింది. వృత్తి రీత్యా దుబాయ్, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో ఉండే ఈ మిత్రులు సొసైటీ బాధ్యతలను తల్లిదండ్రులు సూర్యనారాయణ, జయలక్ష్మిలకు అప్పగించారు. వారిద్దరూ వన్ లైఫ్‌కు ప్రెసిడెంట్, ట్రెజరర్‌గా ఉంటూ బిడ్డ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
స్వచ్ఛందంగా..
ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా సాగే 'వన్‌లైఫ్'లో అన్ని వయస్సుల వారు సభ్యులుగా ఉన్నారు. వీరి కౌన్సిలింగ్ అంతా టెలీకాల్స్ ద్వారానే సాగుతుంటాయి. రోజుకు 30 నుంచి 40 చొప్పున నెలలో.... ఐదు వందల నుంచి వెయ్యి వరకు అన్ని రాష్ట్రాలకు చెందిన ఫోన్ కాల్స్‌ను వాలంటీర్లు స్వీకరిస్తుంటారు. వెబ్ సైట్ ద్వారా, రిజిస్టర్ అయిన నంబర్ ద్వారా వచ్చిన కాల్స్‌ను వాలంటీర్లు స్వీకరించి, సమస్యలతో డిప్రెషన్‌లోకి వెళ్లిన వారు ప్రతికూల నిర్ణయాలు తీసుకోకుండా మార్గదర్శనం చేస్తున్నారు. ఒంటరి తనం, డిప్రెషన్, క్షణికావేశం, మనస్పర్ధలు, ఆర్థిక ఒత్తిడులు, కుటుంబ కలహాలు, ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య, ఒక్కో కారణం.. అయినా వీటికి ఆత్మహత్య పరిష్కారం కాదంటూ... కౌన్సిలింగ్ ఇస్తున్నారు 'వన్ లైఫ్' బృందం. 'బలవన్మరణం సరికాదు... బయటపడే దారి మేం చూపిస్తామంటూ' భరోసానిస్తున్నారు. వీరంతా ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో ఈ బృహత్తర కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
నిత్యం సమీక్ష
జీవితాలను అర్ధాంతరంగా ముగించుకునే స్థితిలో ఉన్నవారు తీవ్ర ఒత్తిడికి లోనుకావటం, ఒంటరి, ముభావంగా ఉండటం, ఘర్షణ, అణచివేత ఇలా పలు కారణాలుంటాయి. వాటన్నింటినీ వాలంటీర్లు గుర్తించి.... సమస్యను సావధానంగా విని పరిష్కార మార్గం చూపగలగాలి. అలా అయితేనే వారు ఆత్మహత్యలువంటి విపరీత ఆలోచనలనుంచి బయటపడతారు. ఇందుకోసం బాధితుల నుంచి ఫోన్‌కాల్స్ స్వీకరించే వాలంటీర్లకు కౌన్సిలర్లు నెలనెలా శిక్షణనందిస్తుంటారు. కొత్త సమస్యలు, పరిష్కార మార్గాలపై సొసైటీ సభ్యులు నిత్యం సమీక్ష జరుపుతుంటారు. వాలంటీర్లు బాధితులతో మాట్లాడే విధానం, సమస్యను గుర్తించే విధానంపై ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తుంటారు. ఫోన్ కాల్స్ ద్వారా పరిష్కారం కాని సమస్యలకు.. పానెల్ సైకలాజిస్ట్, సైకియార్టిస్ట్లకు అనుసంధానం చేస్తుంటారు. ఆత్మహత్యలు అనే ఆలోచనలు వస్తే తమను సంప్రదించాలని సభ్యులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:కంగారూ మదర్ కేర్.. బరువు తక్కువున్నా బేఫికర్