సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కలిసి లక్ష గొబ్బెమ్మల తయారీకి శ్రీకారం చుట్టారు. 100 మంది విద్యార్థులు ఈ నెల 20న హైదరాబాద్ జియాగూడలో కామధేను గోశాలలో లక్ష గొబ్బెమ్మలను తయారు చేయనున్నారని తెలంగాణ గోశాల ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గొబ్బెమ్మలను తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.
పండుగల స్పెషల్
సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం ప్రిన్సిపల్ డాక్టర్ డి.శోభన సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి వంటి పండుగల సమయంలో ఉపయోగించే సామాగ్రిని తమ కళాశాల విద్యార్థినిలు గోమాత పేడతో వినూత్న రీతిలో తయారు చేశారని అధ్యాపకురాలు స్వప్న వివరించారు. కళాశాలలో 3,500 విద్యార్థినీలు ఉండగా వారిలో నేషనల్ సోషల్ సర్వీస్‌లో మూడు యూనిట్లు పనిచేస్తున్నాయని... అందులో ఒక్కొక్క యూనిట్ నుంచి 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వెల్లడించారు.