పదో తరగతి ఫలితాల్లో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.40 లక్షల మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్లు అధికారులు తేల్చారు. కొన్ని జిల్లాల్లో మొత్తం హాజరైన విద్యార్థుల్లో 30-45 శాతం మందికి 10 జీపీఏ దక్కడం విశేషం. పదో తరగతిలో ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ)కు ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులు ఉంటాయి. మిగిలిన 80 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఈసారి కరోనా నేపథ్యంలో పరీక్షల రద్దుతో ఎఫ్‌ఏలో వచ్చిన మార్కులను 100కి లెక్కించి ఆ ప్రకారం గ్రేడ్లు ఇచ్చారు. అంటే ఎఫ్‌ఏలో ఒక సబ్జెక్టులో 20కి 18 మార్కులు వస్తే 100కి 90 మార్కులు వచ్చినట్లు పరిగణిస్తారు. అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వటం వల్ల అందరూ ఉత్తీర్ణులయ్యారు. 10జీపీఏ దక్కించుకున్న వారి సంఖ్యా ఈసారి లక్ష దాటింది. గత ఏడాది ఆ సంఖ్య కేవలం 8,600 మాత్రమే.
కొన్ని జిల్లాల పరిస్థితి..
* కరీంనగర్ జిల్లాలో 14,102 మందికి 6,446 మంది 10 జీపీఏ పొందారు. అంటే 46 శాతం మంది అన్ని సబ్జెక్టుల్లో ఏ1 గ్రేడ్ దక్కించుకున్నారు.
* నల్గొండ జిల్లాలో 20,571 మందికి 6,642 మంది 10 జీపీఏ దక్కింది. 32% మంది ఏ1 గ్రేడ్ సాధించారు.
* సిద్దిపేట జిల్లాలో 14,268 మందిలో 4,664 మంది 10 జీపీఏ సాధించారు. ఇది 32 శాతంతో సమానం.