Telangana Kanti Velugu: కంటి వెలుగు కార్యక్రమం అమలు తీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నమూనాల పరిశీలన, ప్రజారోగ్యం.. తదితర అంశాలపై గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మరోసారి విజయవంతం చేద్దాం:ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..‘‘గతంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొంది. కంటి చూపు కోల్పోయిన పేద వృద్ధులకు చూపు అందింది. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవు. గతంలో మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా మరోసారి పరీక్షలు నిర్వహించి కావాల్సిన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తాం’’ అని సీఎం స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, కంచర్ల భూపాల్‌రెడ్డి, జి.విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ గడల శ్రీనివాసరావు, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తొలివిడతలో 100 శాతం లక్ష్యసాధన:తొలివిడత కంటి వెలుగు కార్యక్రమం ఆగస్టు 15 2018లో ప్రారంభమై.. 2019 మార్చి 31తో ముగిసింది. రాష్ట్రంలోని 9,887 గ్రామాల్లో 1,54,71,769 మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతో లక్ష్యం వంద శాతానికి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు కంటి పరీక్షలు పొందిన జిల్లాల్లో హైదరాబాద్(8,92,256) మొదటి స్థానంలో నిలవగా, రంగారెడ్డి(8,60,891), మేడ్చల్(8,28,822) జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా 24,67,481 మందికి సాధారణ దృష్టిలోపాలను సరిచేసే కళ్లద్దాలు అవసరమని గుర్తించగా.. ఇప్పటి వరకూ 23,41,636(94.9శాతం) మందికి అందజేశారు.