TRS Executive meeting: తెరాస శాసనసభపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరగనుంది. ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. వీటితో పాటు తెరాస రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరుగనున్నది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతో పాటు తెరాస రాష్ట్రస్థాయి నేతలు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై లోతైన విశ్లేషణ జరగనుంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన తర్వాత పార్టీ యంత్రాంగం ఏవిధంగా పనిచేయాలి, పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశముంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక అనుభవాలు, ఓటింగ్‌పై విశ్లేషించిన తర్వాత దానిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై చర్చ.. :రానున్న రోజుల్లో భాజపా తీరును ఎలా ఎండగట్టాలి, కాంగ్రెస్ పార్టీ పట్ల వైఖరి ఎలా ఉండాలనే దానిపై చర్చ జరిగే అవకాశముంది. ప్రధాని మోదీతో పాటు, భాజపా నేతలంతా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో తెరాస పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరపనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన తర్వాత జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనేదానిపై కూడా చర్చ జరిగే అవకాశమున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఆ అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేం.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో ఏం చర్చించనున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. పైగా ప్రధాని విమర్శలపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఒకరిద్దరు నేతలు మినహాయిస్తే పూర్తిస్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. దీంతో ఈ భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల ఎరకు సంబంధించిన వ్యవహారం కూడా సమావేశాల్లో చర్చకు రానున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై జోరుగా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పార్టీపరంగా ఏం చేయాలనే అంశంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేం చేయనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: