Omicron cases in telangana: రాష్ట్రంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస రావు తెలిపారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కెన్యా నుంచి వచ్చిన మహిళను టోలిచౌకిలో గుర్తించామని.. ఆమెను చికిత్స నిమిత్తం గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదన్న డీహెచ్ ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమాలియా నుంచి వచ్చిన యువకుడి ఆచూకీని హైదరాబాద్ పారామౌంట్ కాలనీలో పోలీసులు గుర్తించారు. బాధితుడిని నేరుగా టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
శాంపిల్స్ సేకరించాం
ఒమిక్రాన్ సుమారు నెల రోజుల్లో 77 దేశాల్లో వ్యాప్తి చెందిందని డీహెచ్ అన్నారు. భారత్‌లో కర్ణాటక, దిల్లీ, గుజరాత్, ఏపీ రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని చెప్పారు. ఒమిక్రాన్ ఆంక్షల అనంతరం రాష్ట్రానికి విదేశాల నుంచి మొత్తం 5,396 మంది వచ్చారని పేర్కొన్న డీహెచ్.. అందులో 18 మందికి కొవిడ్ నిర్ధరణ అయినట్లు తెలిపారు. 15 మందికి ఒమిక్రాన్ నెగిటివ్‌గా తేలినట్లు చెప్పారు. మరో ముగ్గురికి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు రావాల్సి ఉందని వివరించారు. తెలంగాణలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్న డీహెచ్.. బాధితుల కుటుంబసభ్యుల శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు.
జీనోమ్ సీక్వెన్సింగ్‌లో నిర్ధరణ
'రాష్ట్రంలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ ఇద్దరూ ఈ నెల 12న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధరణ అయింది. బాధితులను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించాం. -శ్రీనివాస్ రావు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు