Omicron Cases increased in telangana: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయంగా మారింది. కేవలం నెలన్నర రోజుల్లోనే సుమారు 90 దేశాలకు వ్యాప్తి చెందిన ఒమిక్రాన్... ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వందకు చేరింది. డిసెంబర్ ఒకటి నుంచి తెలంగాణలోనూ కేంద్రం ఆదేశాల మేరకు విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టులో నిర్ధరణ పరీక్షలు నిర్వహించి వారిలో ఒమిక్రాన్ బాధితులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 8 మంది ఒమిక్రాన్ బాధితులు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది.
నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలోనే..
Omicron Cases: ఎయిర్ పోర్టులో బంగాల్‌కు చెందిన మరో బాలుడికి చేసిన పరీక్షల్లోనూ ఒమిక్రాన్ నిర్ధరణ కాగా.. సదరు బాలుడి కుటుంబం నేరుగా ఎయిర్ పోర్టు నుంచి మరో విమానంలో బంగాల్ చేరుకున్నారు. అంటే ఇప్పటి వరకు తెలంగాణలో గుర్తించిన కేసులు 9. వీరిలో కెన్యా నుంచి ముగ్గురు రాగా... దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబీ, సూడాన్, యూకే, చెక్ రిపబ్లిక్ నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఇందులో ఇద్దరు మినహా మిగతా ఏడుగురు నాన్ రిస్క్ దేశాల నుంచే రాష్ట్రానికి చేరుకున్నారు. అంటే ఎట్ రిస్క్ దేశాలతో పోలిస్తే నాన్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారిలో అధిక మొత్తంలో ఈ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మొత్తం 90 దేశాల్లో..
'దేశంలో 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 8 కేసులు నిర్ధరణయ్యాయి. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణైంది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దు. వైరస్ సోకిన బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదు. దేశంలోని ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే ఆస్పత్రుల్లో చేరారు. ఒమిక్రాన్‌తో ప్రాణాపాయం లేదు. ఒమిక్రాన్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ మరణమే నమోదైంది. ఒమిక్రాన్ పట్ల అనవసర భయాందోళన అవసరంలేదు. భవిష్యత్‌లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ తీసుకోకపోవడమే కూడా వ్యాప్తికి కారణం. రాష్ట్రంలో 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు. 11 జిల్లాల్లో వందశాతం మొదటి డోసు తీసుకున్నారు. 56 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. -డీహెచ్ శ్రీనివాసరావు
కేవలం 2శాతం మందికే ఆర్టీపీసీఆర్ పరీక్షలు