తెలంగాణ

telangana

ETV Bharat / state

Omicron Cases in Telangana: రాష్ట్రంలో 8కి చేరిన ఒమిక్రాన్ కేసులు

Omicron Cases in Telangana
ఒమిక్రాన్ కేసులు

By

Published : Dec 17, 2021, 12:06 PM IST

Updated : Dec 17, 2021, 4:55 PM IST

12:03 December 17

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

Omicron Cases in Telangana: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య మొత్తం 8కి చేరినట్లు ప్రజారోగ్యసంచాలకులు శ్రీనివాస్‌ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్‌ సామూహిక వ్యాప్తి లేదన్న ఆయన.... కొత్త వేరియంట్‌ పట్ల ఆందోళన అవసరంలేదన్నారు. మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలంతా వ్యాక్సిన్‌ వేసుకోవటం సహా జాగ్రత్తలన్నీ పాటించాలని సూచించారు.

భవిష్యత్‌లో కరోనా మరో 10 కొత్త వేరియంట్లుగా వచ్చే అవకాశం ఉందని ప్రజారోగ్యసంచాలకులు శ్రీనివాస్‌రావు తెలిపారు. కొవిడ్‌ ఏ వేరియంట్‌లో వచ్చినా.... ప్రత్యేకంగా చూడాల్సిన అవసరంలేదన్నారు. టీకా వేసుకోవటంలో నిర్లక్ష్యమే ఒమిక్రాన్‌ వ్యాప్తికి ఓ కారణంగా గుర్తించినట్లు చెప్పారు. తాజాగా రాష్ట్రంలో నిర్ధరణ అయిన కేసుల్లో ఇదే విషయం బయటపడినట్లు చెప్పారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9 మందికి ఒమిక్రాన్‌ నిర్ధరణ అయిందని.. వీరిలో 8 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారని చెప్పారు. మరొక వ్యక్తి పశ్చిమ్‌ బంగకు చెందిన వారున్నప్పటికీ... ఆయన రాష్ట్రంలోకి ప్రవేశించలేదని డీహెచ్‌ వివరించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ సామూహిక వ్యాప్తి లేదని వెల్లడించారు.

95 శాతం మందిలో లక్షణాలు లేవు..

కొత్త వేరియంట్ పట్ల భయాందోళన అవసరంలేదని డీహెచ్​ తెలిపారు. వైరస్‌ బారిన పడిన 95శాతం మందిలో వ్యాధి లక్షణాలు లేవని... ఎవరూ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారంలేదన్నారు. ఒమిక్రాన్‌తో ప్రాణాలు కోల్పోయే అవకాశమే లేదని చెప్పారు. అలాగని అజాగ్రత్తగా ఉంటే ముప్పు తప్పదని హెచ్చరించారు. భౌతిక దూరం, మాస్కు ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవటం... ఇలా కరోనా జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అన్ని విధాల సిద్ధంగా ఉన్నాం

కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం, మందులు, ఇతర సౌకర్యాలతో పాటు మానవ వనరులు పూర్తిగా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నట్లు డీహెచ్​ తెలిపారు. 11 జిల్లాల్లో వందశాతం మొదటి డోసు తీసుకున్నారని... 56 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలంతా తప్పని సరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు.

'మన రాష్ట్రంలో మొత్తం 8కేసులు ఉన్నాయి. వాటిలో 7 ఏడు కేసులు హైదరాబాద్​లో ఉండగా.. వరంగల్​లో ఓ కేసు ఉంది. యూకే నుంచి వరంగల్​కు వచ్చిన మహిళకు ఎయిర్​పోర్టులో టెస్టు చేయగా.. నెగిటివ్​ వచ్చింది. ఆ తర్వాత హోం క్వారంటైన్​లో ఉంచాం. ఎనిమిదో రోజు టెస్టు చేయగా.. పాజిటివ్​ వచ్చింది. శాంపిల్స్​ తీసుకుని జీనోమ్​ సీక్వెన్సింగ్​కు పంపగా ఒమిక్రాన్​ పాజిటివ్​ నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా.. ఒమిక్రాన్​ వేరియంట్​కు సంబంధించి సామాజిక వ్యాప్తి జరిగినట్లు లేదు. అలాగే స్థానికంగా ఉన్న వారికి ఒమిక్రాన్​ సోకలేదు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 90 కేసులు వచ్చాయి. ఈ వేరియంట్​ పట్ల ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన పనిలేదు. ఒమిక్రాన్​ పాజిటివ్​ వచ్చిన వారిలో సుమారు 95 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఎక్కడో ఒకరిద్దరు ఆస్పత్రిలో చేరారు. ఇప్పటి వరకు యూకేలో తప్ప ఎక్కడా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అజాగ్రత్తగా ఉంటే వైరస్​ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వయో వృద్ధులు, దీర్ఘకాలికి వ్యాధులతో బాధపడుతున్నవారిపై ఈ వేరియంట్​ ఎలా ప్రభావం చూపుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ మహమ్మారి కట్టడికి కొవిడ్​ నిబంధనలు కఠినంగా పాటించాలి.'- శ్రీనివాస్‌రావు, రాష్ట్ర ప్రజారోగ్యసంచాలకులు

కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. ఇంటా బయటా మాస్కు ధరించాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లనే ఒమిక్రాన్ వ్యాపిస్తోందని తెలిపారు. లాక్‌డౌన్ పెడతారన్న దుష్ప్రచారాలను నమ్మవద్దని.. కానీ ప్రజలంతా బాధ్యతగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి:DH Srinivasa Rao on Omicron: జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కేసులు పెరిగే అవకాశం: డీహెచ్

Last Updated : Dec 17, 2021, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details