తిరుమల శ్రీవారిని భారత స్టార్ షట్లర్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు దర్శించుకున్నారు. ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్వామి వారిని దర్శించుకున్నారు.
కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి దర్శనార్థం విచ్చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అర్చకులు ఆమెకు అందజేశారు.
సింధుతో పాటు తిరుమల శ్రీవారిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. మాతృభాషలోనే పాలన సాగేలా కృషి చేస్తున్నామని.. ఇలా జరిగితే ప్రభుత్వం అమలు చేసే అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతాయన్నారు.
ఇదీ చదవండి:Hyderabad police: నా పతకం పోలీస్ సేవలకు అంకితం: పీవీ సింధు