ఏపీ అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వీధిలో షేక్ అమీనా బీ అనే వృద్ధురాలు నివసిస్తోంది. గత 50 ఏళ్ల నుంచి ఆమె అదే ప్రాంతంలో ఉంటోంది. ఆమె భర్త 30 ఏళ్ల క్రితం మరణించాడు. భర్త మృతి చెందినప్పటి నుంచి ఆమెకు పింఛన్ వస్తోంది. గత 20 ఏళ్లుగా ప్రభుత్వం అందిస్తోన్న వితంతు పింఛన్ తీసుకుంటుంది. 200 రూపాయల నుంచి తెదేపా హయాంలో పెంచిన రూ.2 వేలు.. ఆపై వైకాపా ప్రభుత్వంలో 2,250 రూపాయల పింఛన్ తీసుకుంటూ దానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది.
ఇంత వరకు బాగానే ఉన్నా... గత రెండు నెలలుగా షేక్ అమీనాబీకి ఉన్నట్టుండి పింఛన్ నిలిచిపోయింది. ఊళ్లో చాలా మందికి వస్తుండగా.. తనకెందుకు రావట్లేదో తెలుసుకుందామని ప్రయత్నించింది. తన జీవనాధారమైన పింఛన్‌ను ఎందుకు ఆపేశారో చెప్పాలని అక్కడ సిబ్బందిని ప్రశ్నించింది. అధికారులు చెప్పిన సమాధానం విని బామ్మ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే ఆమె వయసు ఆధార్ కార్డులో 16 ఏళ్లని ఉంది. కేవలం ఆధార్ కార్డులోనే కాకుండా, రేషన్ కార్డులో కూడా అంతే వయసు ఉందని.. ఆందుకే పింఛన్ తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.