తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్​: 'సరిలేరు మీకెవ్వరు' అనిపించారు...

ఒంట్లో అన్నీ అవయవాలు సరిగ్గా ఉన్నా.. ఇల్లు దాటాలంటే బద్దకిస్తారు కొంతమంది. కానీ.. మున్సిపల్ ఎన్నికల్లో కనిపించిన కొన్ని దృశ్యాలు మాత్రం 'సరిలేరు మీకెవ్వరు' అనిపించాయి. కాళ్లు లేకపోయినా.. కళ్లు కనిపించకపోయినా.. వందేళ్లు నిండి నడవడానికి ఓపిక లేకపోయినా.. ఓటేసేందుకు తరలివచ్చి స్ఫూర్తిగా నిలిచారు.

OLD MEN AND PHYSICALLY HANDICAPPED PEOPLE PARTICIPATED IN MUNICIPAL POLLING
OLD MEN AND PHYSICALLY HANDICAPPED PEOPLE PARTICIPATED IN MUNICIPAL POLLING

By

Published : Jan 22, 2020, 5:43 PM IST

బస్తీమే సవాల్​

ఎన్నికలు ఐదేళ్లకొసారి జరిగే ఓ ప్రహసనం కాదు. డబ్బులు తీసుకొని అమ్ముకునే వస్తువు అంతకంటే కాదు. ఓటనేది మన బాధ్యత.. మన పాలకులను మనమే నిజాయితీగా ఎన్నుకునే ఓ అవకాశం. ఆ అవకాశాన్ని కరెక్టుగా వినియోగించుకోవాలని నిరూపించారు వీళ్లు.

వందేళ్ల బాధ్యత...

మేడ్చల్​ జిల్లా దుండిగల్ పురపాలికకు చెందిన బౌరంపేట్​లో 101 ఏళ్ల రాములమ్మ వీల్​చెయిర్​లో వచ్చి ఓటేసింది. వందేళ్లు నిండినా.. ఓపిక లేకపోయినా.. ఓటు వేసే బాధ్యతను మాత్రం విస్మరించలేదు. అదే పురపాలికకు చెందిన 80 ఏళ్ల మరో వృద్ధురాలు కూడా వీల్​చెయిర్​లో వచ్చి ఓటేసి నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది.

చూపులేకపోయినా.. ముందుచూపుతో ఓటేశాడు..

చూసేందుకు కళ్లు లేవు. అయితేనేం... ముందుచూపుతో ఓటేశాడు అదిలాబాద్​కి చెందిన ముత్యంరెడ్డి. ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమణ పొంది విశ్రాంతి తీసుకుంటున్నాడు. కంటిచూపు లేకపోయిన కొడుకుతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేశాడు. ఓటుహక్కు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు.. ఓటు వేయడం మన బాధ్యతని నిరూపించాడు.

కాళ్లే చేతులుగా...

విద్యుదాఘాతం వల్ల జరిగిన ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు నరేశ్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్​పేట్​లో ఉంటాడు. పురపాలక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలో కాలితో ఓటేస్తూ అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. ఓటు వేసిన తర్వాత మోచేతికి ఇంక్ వేయించుకున్నాడు.

చేతులు లేకున్నా ఓటేశారు..

రెండు చేతులు లేకున్నా ప్రజాస్వామ్యాన్ని బతికించడంతో తనవంతు పాత్ర పోషించాడు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​కి చెందిన జకీర్ పాషా. 11వ వార్డులో జాకీర్​ పాషా కాలితో ఓటు వేశాడు. జకీర్​ పాషాకి పుట్టుకతో రెండు చేతులు లేవు. తన రెండు కాళ్లను ఉపయోగిస్తూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు. ఓటు హక్కునూ అలానే వినియోగించుకున్నాడు జకీర్.

మంచిర్యాల పట్టణం రెండోవార్డుకు చెందిన సతీష్​కు చిన్నప్పటి నుంచే రెండు చేతులు లేవు. సతీష్ ఇప్పటి వరకు 11 సార్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపాడు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలంటున్నాడు సతీష్​.

ఇవీ చూడండి: కళ్లులేకపోయినా... ఓటేసి ఆదర్శంగా నిలిచిన వృద్ధుడు

ABOUT THE AUTHOR

...view details