తెలంగాణ

telangana

ETV Bharat / state

పుస్తకపఠనానికి వయసు కాదు అనర్హం - ఎన్టీఆర్ స్టేడియంలో ఏటా జరిగే జాతీయ పుస్తక ప్రదర్శన

చదవటం, నేర్చుకోవటంలో నిత్య విద్యార్థి అయి ఉండాలంటారు. ఆ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఈ లేటు వయసు కుర్రాళ్లు. పుస్తకపఠానాసక్తి, అభిరుచిని కొనసాగిస్తూ నేటి యువతకు నాటి తరం పెద్దలు ఆదర్శంగా నిలుస్తున్నారు. 3జీ, 4జీ, 5జీ ఇలా ఎన్ని తరాలు మారినా.. పుస్తకానికున్న విలువ ఇసుమంతైనా తగ్గలేదని, ఈ-పుస్తకాలు వస్తున్నా.. రెండు చేతుల్లో పట్టుకొని భౌతికంగా చదవటమే  తమకిష్టమని  పెద్దలంటున్నారు. చూపు మందగించినా.. అక్షరజ్ఞానం కోసం వారు చేస్తోన్న తపన, తాపత్రయం వారిని నిత్యం ఉత్తేజంగా.. ఉత్సాహంగా ఉంచుతోందని వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పుస్తకపఠనానికి వయసు కాదు అనర్హం
పుస్తకపఠనానికి వయసు కాదు అనర్హం

By

Published : Dec 31, 2019, 7:47 PM IST

Updated : Dec 31, 2019, 8:30 PM IST

హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏటా జరిగే జాతీయ పుస్తక ప్రదర్శనను లక్షల్లో పుస్తక ప్రియులు సందర్శిస్తుంటారు. చిన్నా, పెద్దా, తేడా లేకుండా అందరికీ కావాల్సిన అన్ని రకాల పుస్తకాలతో 330 స్టాళ్లు ఇక్కడ కొలువుదీరాయి. పిల్లలు, యువతతో పాటు.. పుస్తకాల వెతుకులాటలో నాటితరం పెద్దలు ఎంతో ఆసక్తితో పనిగట్టుకొని మరీ బుక్ ఫెయిర్​ను సందర్శిస్తున్నారు. చేతిలో సంచి పట్టుకొని.. తమకిష్టమైన పుస్తకాలు కొనుక్కుంటూ వాటన్నింటినీ పదిలంగా తమ ఇంటి లైబ్రరీలో దాచుకోవటానికి వారు చూపిస్తోన్న శ్రద్ధ, ఉత్సాహం పుస్తక పఠనంపై వారికున్న నిబద్ధతను చాటుతోంది.

రిటైరై ఇంటి దగ్గరే ఉండటం వల్ల మిగిలి ఉన్న శేష జీవితాన్ని తమకిష్టమైన పుస్తకాలు చదువుతూ.. అలా పొందిన జ్ఞాన సముపార్జనను నలుగురితో పంచుకుంటామని పెద్దలు అంటున్నారు. ఇందుకోసం ఏటా వచ్చే బుక్ ఫెయిర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తామని.. ఇలా కొన్న పుస్తకాలతో తమ ఇంట్లో.. లైబ్రరీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. కాలక్షేపంగా రోజుకో పుస్తకాన్ని తిరగేయనిదే సంతృప్తిగా ఉండదని వారిలో ఉన్న పుస్తకాభిరుచిని వ్యక్తం చేస్తున్నారు.

వయసు పైబడిన తమకు పుస్తకాలే మంచి నేస్తాలని.. రేడియోలు అలవాటైన తమకు.. ఈ టీవీలు, కంప్యూటర్లపై ఎక్కువ సమయం వెచ్చించలేమన్నారు. బంధువులు, స్నేహితుల తర్వాత తమకు పుస్తకాలే ఆప్త మిత్రులని చెబుతున్నారు. పుస్తక ప్రదర్శనకు వచ్చే పెద్దలు ఇక్కడ మంచి స్నేహితులుగా మారుతున్నారు. ఎక్కడికెళ్లినా కొత్త పుస్తకం బాగుంది అనుకుంటే కొని సంచిలో వేసుకుంటున్నారు. చదివేసిన పుస్తకాలను పిల్లలు, స్నేహితులు, లైబ్రరీలకు కానుకలుగా ఇస్తామంటున్నారు.

వృద్ధులు ఎక్కువ శాతం ఆధ్యాత్మిక పుస్తకాలకే ఓటేసినా.. కథలు, కాల్పనిక సాహిత్యాలు, అవార్డులు పొందిన రచయితల పుస్తకాలు ఇలా అన్ని రకాలను తాము ఆస్వాదిస్తామని లేటు వయసు యువకులు తెలిపారు. హైస్కూలులో అలవాటైన పుస్తకాభిరుచి జీవితాంతం ఇలాగే కొనసాగుతుందన్నారు. ఏదేమైనా.. పిల్లలు, విద్యార్థులతో పోటీపడి మరీ పెద్దలు పుస్తకాలు చదవటం, కొనటం.. బద్ధకస్తులైన చదువరులకు స్ఫూర్తినిస్తున్నారు.

పుస్తకపఠనానికి వయసు కాదు అనర్హం
Last Updated : Dec 31, 2019, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details