న్యాయస్థానం ఆదేశాల మేరకు పుల్లారెడ్డి నివాసంలో నిర్మించిన గోడను తొలగించినట్లు హైదరాబాద్ జిల్లా ప్రొటెక్షన్ అధికారి అక్కేశ్వరరెడ్డి తెలిపారు. పుల్లారెడ్డి కుమారుడైన రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి.. తనను ఇంట్లో తిరగనివ్వకుండా గోడ కట్టారని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం.. గోడను కూలగొట్టాలని ఆదేశించారు.
ఈ మేరకు అధికారులు పుల్లారెడ్డి నివాసానికి చేరుకోగా.. రాఘవరెడ్డి తరఫు న్యాయవాది పునరాలోచించుకోవాలని చెప్పినట్లు ప్రజ్ఞారెడ్డి తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అడ్డుగా నిర్మించిన గోడను తొలగించారని పేర్కొన్నారు.
ఇదీ అసలు సంగతి..
బెంగళూరుకు చెందిన కె.ప్రజ్ఞారెడ్డికి 2014 మార్చి 19న హైదరాబాద్‌కు చెందిన పుల్లారెడ్డి స్వీట్స్ వ్యవస్థాపకుడు జి.పుల్లారెడ్డి మనుమడు ఏకనాథ్‌రెడ్డి(కుమారుడు రాఘవరెడ్డి, కోడలు భారతిరెడ్డిల కుమారుడు)తో వివాహమైంది. వారు అత్తమామలతో కలిసి బేగంపేటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా ఏకనాథ్‌రెడ్డి రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో భర్త, అత్తమామలు ప్రజ్ఞారెడ్డి కుటుంబం నుంచి మరింత డబ్బు వసూలు చేసే ప్రయత్నంలో భాగంగా వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేయమని ఒత్తిడి చేశారు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను వారు వేధించడం మొదలుపెట్టారు. వీరి విడాకులకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.