పంజాగుట్ట సమీపంలోని ఒక ఔషధ దుకాణంలో వైద్యుల చీటీలు లేకుండానే కోరినన్ని నొప్పి నివారణ మాత్రలు విక్రయించారు. ఖైరతాబాద్‌లోని మరో షాపులో దగ్గు ద్రావణాన్ని, ఇంకో చోట నిద్రమాత్రలు యథేచ్ఛగా అమ్మారు. పంజాగుట్ట నుంచి కోఠి వరకూ ఉన్న ఔషధ దుకాణాల్లో పరిశీలించగా, చాలా దుకాణాల్లో మందులిచ్చే వారెవరూ తెల్లకోటు ధరించలేదు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, తదితర ప్రాంతాల్లో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ జరిపిన పరిశీలనలోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి. ఔషధ నియంత్రణ సంస్థ ఆకస్మిక తనిఖీల్లో కూడా పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
విచ్చలవిడిగా విక్రయాలు
రాష్ట్రంలోని మందుల దుకాణాల్లో మత్తును కలిగించే ఔషధాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. యాంటీ డిప్రెషన్, యాంటీ అలర్జీ, అధిక మోతాదు నొప్పి నివారణ మాత్రలు, దగ్గు ద్రావణాలను కచ్చితంగా వైద్యుల చీటీ ఉంటేనే విక్రయించాల్సి ఉండగా, దుకాణాలు ఈ నిబంధనను ఖాతరు చేయడం లేదు. దాదాపు మూడొంతుల దుకాణాల్లో అర్హులైన ఫార్మసిస్టులే లేరు. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో 200కి పైగా దుకాణాల్లో నిబంధనలను పాటించడంలేదని అధికారులు గుర్తించారు. వాటిని సత్వరమే మూసివేయించామని, దుకాణదారులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొంది.
అధిక మోతాదు ముప్పే..
‘పారాసెటమాల్, డైసైక్లోమైన్, ట్రెమడాల్’ సమ్మిళిత ఔషధాన్ని తీవ్రమైన నొప్పి నివారణకు వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ‘ట్రెమడాల్’ అనే ఔషధం ‘ఓపియాయిడ్స్’ అనే మాదక ద్రవ్యాల జాబితాకు చెందినది. మెదడులోని ‘నోర్‌పైన్‌ఫ్రైన్’, ‘సెరోటోనిన్’పై పనిచేసి, నొప్పిని తెలియనివ్వదు. కొందరు దీన్ని మత్తు కోసం ఎక్కువ మోతాదులో వాడుతున్నట్లు గుర్తించారు. ఇది ఆరోగ్యానికి ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగర ప్రాంతాల్లో యువత ఇలాంటి మందులను కొన్ని దుకాణదారులతో లాలూచీ పడి కొనుగోలు చేస్తున్నారని ఔషధ నియంత్రణ అధికారి ఒకరు తెలిపారు.
నిబంధనల ఉల్లంఘన
ప్రతి ఔషధ దుకాణంలోనూ కచ్చితంగా ఫార్మసిస్టు సమక్షంలోనే వినియోగదారులకు మందులను విక్రయించాలి. ఫార్మసిస్టు తప్పనిసరిగా తెల్ల కోటు(యాప్రాన్) ధరించాలి. వైద్యుల చీటీ జిరాక్స్‌ను దుకాణంలో తప్పనిసరిగా భద్రపరచాలి. ఏ వైద్యుడు రాశారు? ఎన్ని మాత్రలు రాశారు? ఎవరికి ఇచ్చారు? తదితర సమాచారమంతా ఒక పుస్తకంలో రాయాలి. చాలా దుకాణాల్లో ఇవేమీ పాటించడంలేదని తేలింది.