Rescheduling TSPSC exams: గ్రూప్-1 ప్రిలిమినరీతో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డివిజనల్ అకౌంట్స్ అధికారి గ్రేడ్-2 పోస్టుల పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఆయా పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకు వచ్చినట్లు తెలియడంతో కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజినీరు పరీక్షను రద్దు చేసినందున ఈ జాబితాలో నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలు చేరాయి. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక, టీఎస్పీఎస్సీ అంతర్గత విచారణ నివేదికపై ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ అత్యవసరంగా సమావేశమైంది. ఆయా నివేదికలపై చర్చించి.. ఈ మూడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ముందుగానే బయటకు వచ్చినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
గ్రూప్-1 ప్రిలిమనరీ జూన్ 11న:ప్రశ్నపత్రాల లీకేజ్ అయినందున పరీక్షల షెడ్యూలును రీ షెడ్యూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రశ్నాపత్రాలన్నీ కొత్తగా రూపొందించాల్సి ఉండటంతో.. ఇక నుంచి జరిగే పరీక్షలు దాదాపు రీ షెడ్యూలు అయ్యే అవకాశముంది. ఏప్రిల్, మే నెలలో ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై కమిషన్ ఆలోచిస్తోంది. అక్టోబరు నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏడు పరీక్షల్లో ఇప్పటికే నాలుగు రద్దయ్యాయి. తొలుత ఏఈ పరీక్ష రద్దుకాగా తాజాగా గ్రూప్-1, డీఏఓ, ఏఈఈ పరీక్షలు ఆ జాబితాలో చేరాయి. గ్రూప్-1 ప్రిలిమినరీని జూన్ 11న తిరిగి నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. రద్దయిన మిగతా పరీక్షల షెడ్యూలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. పరీక్షల రీ షెడ్యూలుతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంకాస్త ఆలస్యం అవ్వనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ, ఇతర బోర్డులు, కమిషన్ల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు షెడ్యూలు వచ్చింది. అభ్యర్థులు మిగతా పోటీపరీక్షలూ రాసేలా పరీక్షల తేదీలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది.