తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 'మీరు ఎంత నడిపితే మేమూ అంతే' అన్న విధానం ప్రకారం రెండు రాష్ట్రాలు సమాన సంఖ్యలో సర్వీసులు, కిలోమీటర్లు నడిపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వీటికి సంబంధించి మూడు దశల్లో ఒప్పందం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రతిపాదించింది.
ప్రస్తుతం డిమాండు బాగున్న మార్గాల్లో బస్సులు నడపాలన్నది వ్యూహంగా ఉంది. ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన నూతన రవాణా చట్టంలో అంతర్రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు ఒప్పందం చేసుకోవాలంటే ఆయా మార్గాలను ముందుగా ప్రకటించాలి. ఆ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పడుతుంది. అందుకు వీలుగా రెండు దశల్లో చర్చలకు అధికారులను పంపాల్సిందిగా ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణను కోరింది.