Officials Demolishing an Old Building in Quthbullapur : చింతల్ శ్రీనివాసనగర్ చెందిన నాగేశ్వరరావు దాదాపు 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇల్లు.. ప్రస్తుతం రోడ్డు కంటే దిగువగా ఉండటంతో వర్షాకాలంలో వాన నీరంతా ఇంటి లోపలికి వస్తుంది. దీంతో తన ఇంటి కింది భాగంలో గోడ నిర్మాణం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో చూసి తన భవనాన్ని కూడా పైకి లేపాలని భావించాడు.
దీంతో నాగేశ్వరరావు.. తమిళనాడు బిల్డింగ్ లిఫ్ట్ సర్వీస్ అనే సంస్థతో సంప్రదించి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. నిన్న సాయంత్రం సిబ్బంది ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే భవనాన్ని పైకి లేపడానికి హైడ్రాలిక్ జాకీలతో సంస్థ చేసిన ప్రయత్నం విఫలం అయింది. ఇందులో భాగంగానే ఆ భవనం పక్కనే ఉన్న మరో భవనంపై ఒరిగిపోయింది. మరోవైపు అదే భవనంలో నివాసం ఉంటున్న నాలుగు కుటుంబాలు వారి పిల్లల్ని తీసుకుని భయంతో బయటకు పరుగులు తీశారు.
Building Tilts in Quthbullapur : స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఆ భవనాన్ని పరిశీలించి, దానిని కూల్చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో అధికారులు కొద్ది సమయం ఇచ్చి ఇంట్లో ఉన్న సామాగ్రి తీసుకోవాలని వారికి తెలిపారు. ఈ నేపథ్యంలో వారు ప్రధాన వస్తువులతో పాటు.. కొంత సామాగ్రిని తీసుకున్నారు. మిగిలిన చిన్న చిన్న వస్తువులు ఇంట్లోనే వదిలేసి.. తీసుకున్న వాటితో నివాసితులు రోడ్లపైకి వచ్చారు. నిన్న రాత్రి చుట్టుపక్కల వారి ఇళ్లలో కాలం గడిపారు.
మరోవైపు శనివారం రాత్రి నుంచి భవనంలో అద్దెకు ఉంటున్న కుటుంబీకులు, చిన్నారులు ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల వారు వారికి ఎలాంటి సాయం చేయకపోవడంతో.. దీనంగా చూస్తూ నిల్చున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్.. బాధితులకు కావాల్సిన ఆహారంతో పాటు పునరావాసాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ 24 గంటలు గడుస్తున్నా.. అధికారులు వారిని పట్టించుకోకపోవడంతో ఆహారం లేక బాధితులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
"భవనం షేక్ అవుతుందని ఫోన్ చేసి అడిగాం. ఈ పనిని ఆపమని చెప్పాం. నిన్న పనివాళ్లు ఇంటి పిల్లర్‌ను కట్ చేశారు. అప్పుడు ఇంటి యజమాని వాళ్ల అబ్బాయిని అడిగాం. పిల్లర్ మీదనే ఇల్లు ఉంటుదని చెప్పాం. అయినా వినలేదు. అప్పుడు ఆపినట్లయితే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు తామంతా రోడ్డున పడ్డాం. ఇంత జరిగినా యజమాని నుంచి తమకు ఎలాంటి సహకారం లేదు. మంచినీళ్లు ఇచ్చే దిక్కు కూడా లేదు." - భవనంలో అద్దెకు ఉంటున్న కుటుంబీకులు