Money From DWCRA Women: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలోని వెలుగు అధికారులు పాన్‌కార్డుల దందాకు తెరలేపారు. ప్రతి డ్వాక్రా గ్రూపులోని సభ్యులు కచ్చితంగా పాన్ కార్డు తీసుకోవాలని లేని పక్షంలో వి.వో.ఏ లు తెలుపడమే కాకుండా పాన్ కార్డులు లేకపోతే ఇబ్బందులు వస్తాయంటూ చెప్పుతున్నారని ఆయా డ్వాక్రా సంఘాల మహిళలు తెలిపారు. వెలుగు సిబ్బంది డ్వాక్రా సంఘాల నుంచి పాన్ కార్డు పేరుతో బలవంతంగా లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో సుమారు అక్షరాలా రూ.12 లక్షలు వసూలు చేయగా, ఈ సారి రూ.16 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.
గ్రూపుకి వేయి చొప్పున వసూలు:ఇదంతా ఏ.పీ.ఎం చేయిస్తున్నారని ఆయన ఆదేశాల మేరకు వి.వో.ఎలు పాన్ కార్డ్ చేసే వ్యక్తిని వెంట పెట్టుకుని మరీ.. గ్రూపుల వద్దకి తిరిగి పాన్ కార్డు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. తమ వద్ద నుంచి గ్రూపుకి వేయి చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆయా సంఘాల మహిళలు తెలిపారు. పైగా తమకు ఎలాంటి సమస్య రాకుండా.. పాన్ కార్డ్ తీసుకునే ప్రతి మహిళ,తమ వద్ద పాన్ కార్డు తీసుకొనేందుకు తమకు ఎటువంటి ఇబ్బంది లేదని.. వారి ఇష్ట పూర్వకంగానే తీసుకుంటున్నట్లు ఒక పత్రంపై సంతకం పెట్టించుకుంటున్నారు.