దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలేంటి.. వాటి ద్వారా ఎంత మంది లబ్ధి పొందుతున్నారు. ఎంత మందికి వాటి గురించి తెలుసు.. అవి కాగితాలకే పరిమితమవుతున్నాయా.. ఒక్కసారి తనిఖీ చేయండి విస్తుపోయే విషయాలు బయటపడతాయి. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు.
- హైకోర్టు
దివ్యాంగుల కోసం రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలు, కేటాయించిన నిధులు, వాటి వినియోగం తదితర అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
లాక్‌డౌన్ సమయంలో దివ్యాంగులను ఆదుకోవడానికి అవకాశం కల్పించాలంటూ గణేశ్ కర్ణాటి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య హాజరయ్యారు.
2011 జనాభా లెక్కల ప్రకారం 10.46 లక్షల మంది దివ్యాంగులున్నారని హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం వారి సంఖ్య ఇంకా పెరిగి ఉండవచ్చని అభిప్రాయపడింది. తెల్ల రేషన్‌కార్డు ఉన్న 4.93 లక్షల మందికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేస్తున్నట్టు చెబుతోందని... మిగిలిన వారి సంగతేంటని ధర్మాసనం ప్రశ్నించింది. వారికి ఏయే పథకాల కింద లబ్ధి చేకూరుస్తున్నారో చెప్పాలంది. దివ్యాంగుల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు, అమలు చేస్తున్న పథకాలు వంటి వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
ఆదర్శంగా ఆదిలాబాద్...
అధికారులు ఏసీ గదుల్లో నుంచి బయటకు రావడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏ కార్యక్రమం అమలు చేస్తున్నారు. లబ్ధి పొందిన వారి వివరాలు, నిధుల వినియోగం గురించి తెలుసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక్క జిల్లాను పరిశీలించండి ఎలాంటి విషయాలు బయటపడతాయో చూస్తే ఆందోళన చెందుతారు. ఎస్కిమో సంస్కృతిని అనుసరిస్తున్నామా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దివ్యాంగులు మన పిల్లలు, నిధులు అవసరమైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి, ఆదిలాబాద్‌లో కలెక్టర్ వికలాంగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపినట్టు... రాష్ట్రంలో 33 జిల్లాలలోనూ ఆదిలాబాద్ లాగా చేయండి అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పథకాల అమలుకు అనుసరిస్తున్న విధానమేంటి.. ఎప్పుడైనా ఆడిట్ జరిగిందా.. ఏవైనా లోపాలను గుర్తించారా.. వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరించాలని సూచించింది. సమగ్ర వివరాలతో ఈనెల 15లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
ఇదీ చదవండి:ఎస్‌హెచ్‌వోల పనితీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం