TSSP Has Taken Security Duties In Telangana Secretariat: బీఆర్‌కే భవన్ నుంచి నూతన సచివాలయానికి దస్త్రాల తరలింపు ప్రక్రియను ఆయా శాఖల అధికారులు ప్రారంభించారు. షెడ్యూల్‌కు అనుగుణంగా ఆయా శాఖలకు చెందిన దస్త్రాలు, సామాగ్రిని నూతన భవనంలోకి తరలిస్తున్నారు. ఇవాళ ఏడు, రేపు పది, శుక్రవారం మరో పది శాఖలను తరలించేలా షెడ్యూల్ ఇచ్చారు. అందుకు అనుగుణంగా తరలింపు ప్రక్రియను ప్రారంభించారు. బీఆర్‌కే భవన్లో ఉన్న ఆయా శాఖల దస్త్రాలు, సామాగ్రిని ప్యాకింగ్ చేసి కొత్త సచివాలయంలోకి తరలిస్తున్నారు.
ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలు తరలింపు వేగవంతం: ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలు ఇప్పటికే తరలింపు ప్రక్రియను చేపట్టాయి. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కొత్త సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లారు. ఆయా శాఖలకు చెందిన దస్త్రాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, జెరాక్స్ యంత్రాలను నూతన భవనంలోకి తరలించే చర్యలను చేపట్టారు. నూతన సచివాలయంలో కొత్త ఫర్నీచర్‌ను ఏర్పాటు చేయడంతో.. పాత భవనం బీఆర్‌కే భవన్‌లోనే ఫర్నిచర్‌ను ఉంచేయాలని ఉన్నత అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. శనివారం లోపు అన్ని శాఖల సామగ్రి.. అక్కడి నుంచి పూర్తిగా తరలించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.