తెలంగాణ

telangana

ETV Bharat / state

Fake Seeds: నకిలీ విత్తనాల ముఠాలపై ఉక్కుపాదం - Fake seed gangs

రాష్ట్రంలో కోట్లాది రూపాయలు విలువ చేసే నకిలీ పత్తివిత్తనాలు (Fake seeds) బయట పడుతున్నాయి. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 13 కోట్ల 50 లక్షల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విస్తృత సోదాలు నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ బృందాలు... సీడ్స్‌ మోసగాళ్ల ఆటకట్టిస్తున్నాయి.

నకిలీ విత్తనాలు
నకిలీ విత్తనాలు

By

Published : Jun 10, 2021, 9:27 PM IST

Updated : Jun 10, 2021, 9:43 PM IST

నకిలీ విత్తనాల ముఠాలపై ఉక్కుపాదం

వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న వేళ.. నకిలీ విత్తనాల (Fake seeds) బెడద... రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అక్రమార్కుల ఎత్తుగడలను ముందే పసిగట్టిన ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలనే ఆదేశాలతో పోలీస్‌, వ్యవసాయశాఖ అధికారులు... టాస్క్‌ఫోర్స్‌ బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక్క సూర్యాపేట జిల్లాలో 13 కోట్ల 50 లక్షల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి.

ద్వారకా సీడ్స్ పేరిట...

హైదరాబాద్ వనస్థలిపురం కేంద్రంగా శివారెడ్డి అనే వ్యక్తి ద్వారకా సీడ్స్ పేరిట వీటిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మిరప, టమాట, బెండ, దొండ సహా 15 రకాల నకిలీ విత్తనాలు )(Fake seeds) ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో నకిలీ విత్తనాలు గుర్తించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పలుచోట్ల డీలర్లను నియమించుకున్న శివారెడ్డి... నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది.

ద్వారకా సీడ్స్ అకౌంటెంట్ యాదగిరి, రీజినల్ మేనేజర్ లక్ష్మారెడ్డి సహా నకిలీ విత్తనాలు తయారుచేసి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. విత్తనాల తయారీకి ఉపయోగించే సామగ్రితోపాటు కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోనూ...

ఆదిలాబాద్ జిల్లాలోనూ పెద్దఎత్తున నకిలీ విత్తనాలు (Fake seeds) పట్టుబడ్డాయి. ఇచ్చోడ, గుడిహత్నూర్‌లో దాడులు జరిపిన అధికారులు... 3వేలకుపైగా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 25 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వాసవి ట్రేడర్స్, సహారా ఆగ్రో, రంజిత్, సాయికృష్ణ అగ్రి దుకాణాలు మూసివేసి... యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అడవి రావులచెరువు, తాటికుంట గ్రామాల్లో తనిఖీలు చేసిన పోలీసులు 15 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు పెట్టేందుకు వెనుకాడబోమని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. గుర్తింపు ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.


ఇదీ చదవండి: Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు

Last Updated : Jun 10, 2021, 9:43 PM IST

ABOUT THE AUTHOR

...view details