రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్(LRS)కు అత్యధికంగా గ్రామ పంచాయతీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో 10,83,394 దరఖాస్తులు రాగా, పురపాలక సంఘాల పరిధిలో 10,60,013 దరఖాస్తులు, నగరపాలక సంస్థల్లో 4,16,155 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మొదటిగా ఎఆర్ఎస్ దరఖాస్తుల క్లస్టరింగ్ను ప్రారంభించారు. ఇందులో భాగంగా దరఖాస్తుల వివరాలను క్షేత్ర స్థాయి అధికారులకు గత రెండు రోజులుగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
వివిధ అంశాల ఆధారంగా...
దరఖాస్తులను పంచాయతీ, పురపాలక అధికారులు వివిధ అంశాల ప్రాతిపదికన వర్గీకరించనున్నట్లు తెలుస్తోంది. గ్రామం, సర్వే నెంబర్, ప్రాంతం, కాలనీల వారీగా ఎన్నెన్ని దరఖాస్తులు ఉన్నాయో అన్ని రకాలుగా విభజించనున్నారు. ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అవకాశం కల్పించింది. అనుమతించని లేఅవుట్లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో భారీ సంఖ్యలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయి.
నిబంధనలకు అనుగూణంగా...
దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఎల్‌ఆర్‌ఎస్ అంశం కోర్టులకు చేరడంతో ఈ ప్రక్రియ ఆరునెలలుగా నిలిచిపోయింది. తాజాగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో నిబంధనలకు అనుగుణంగా ఉండి, క్రమబద్ధీకరణకు అవకాశం ఉన్న వాటిని గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి దశలో భాగంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వర్గీకరణ ( క్లస్టరింగ్) చేయాలని, రెండో దశలో భాగంగా లేఅవుట్లు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నిబంధనలు అనుగుణంగా ఉన్న వాటిని గుర్తించాలని పేర్కొన్నారు.