రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీకి శ్రీకారం చుట్టింది. బంగారు, వెండి రంగు అంచులతో మరింత నాణ్యత, నవ్యతతో సిద్ధంచేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మొత్తం 225 డిజైన్లతో సెప్టెంబరు ఆఖరుకల్లా కోటి చీరలు తయారు చేయనున్నారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఈ ప్రక్రియను ఆద్యంతం పర్యవేక్షించనుంది.
ఏటా దాదాపు కోటి మందికి అందజేత
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండగ సందర్భంగా.. 18 ఏళ్లు దాటిన పేద మహిళలకు ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చీరలను కానుకగా అందజేస్తోంది. ఏటా దాదాపు కోటి మందికి ఇవి చేరుతున్నాయి. 2020 బతుకమ్మ పండగ చీరల తయారీపై ఇటీవల చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మరింత నాణ్యత, నవ్యతతో చీరలను రూపొందించాలని నిర్ణయించారు. మంత్రి ఆదేశాల మేరకు చేనేత శాఖ సర్వే నిర్వహించింది.
మేడారం జాతరలో చీరలపై సర్వే
ఇప్పటి వరకు పంపిణీ చేసిన చీరల వినియోగం, కొత్తవి ఎలా ఉండాలనే అనే అంశంపై మహిళల అభిప్రాయాలను సేకరించారు. నిఫ్ట్ నిపుణులు, మహిళా సంఘాలతో మాట్లాడారు. జరి అంచులు ఆకట్టుకుంటున్నాయని.. బంగారు, వెండి రంగు అంచులు కావాలని ఇటీవల మేడారం జాతరలో నిర్వహించిన సర్వేలో మహిళలు కోరారు. వీటన్నింటిపైనా చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్యర్ మంత్రి కేటీఆర్‌కు నివేదిక సమర్పించారు.