వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అనుమతులిస్తూ... కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. కానీ కొందరు త్వరగా వెళ్లాలనే ఆశతో మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోతున్నారు.
త్వరగా వెళ్లాలనుకున్నారు... చివరికి మోసపోయారు...
మధ్యవర్తుల మాటలు నమ్మి... వలస కూలీలు మోసపోయిన ఘటన చాదర్ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సొంతూరుకు పంపిస్తామని, అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి 15 వేల రూపాయలు తీసుకుని ఓ వ్యక్తి ఉడాయించాడు.
ఒడిశాకు చెందిన 35 మంది వలసకూలీలు చాదర్ఘాట్ సమీపంలో జీవిస్తున్నారు. వారు సొంతూరుకు వెళ్లాలని ఓ వ్యక్తిని ఆశ్రయించగా... అతను ఒక్కొక్కరి నుంచి 15 వేల రూపాయాలు తీసుకుని పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన వలస కూలీలు నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద అర్థరాత్రి అందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి... భోజన వసతులు కల్పించారు. వారిని సొంతగ్రామాలకు పంపిస్తామని... నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:వైద్యుడి చెవి కొరికిన గర్భిణి భర్త