increase GSDP Plan of Telangana: రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో వృద్ధిరేటు సానుకూలంగా ఉండటంతో.. మరింతగా పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఉన్న అవకాశాలను మరింతగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీఎస్డీపీని ఇంకా పెంచుకోవాలన్నది సర్కార్ ఆలోచన. 2013-14లో రాష్ట్ర జీఎస్డీపీ రూ. 4 లక్షల 51వేల 580 కోట్లుకాగా.. 2021-22 నాటికి రూ. 11 లక్షల54 లక్షల 860 కోట్లకు చేరింది. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధిరేటు జాతీయ సగటుకంటే అధికంగా నమోదవుతోంది.
ఈ తరుణంలో రాష్ట్రంలోని సానుకూలఅంశాలు, పరిస్థితులదృష్ట్యా జీఎస్డీపీ ఇంకా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వవిధానాలు.. వివిధ వర్గాలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, అనుకూలపరిస్థితులు.. ఇందుకు దోహదం చేస్తాయని అంటున్నారు. అందులో భాగంగా.. ఆయా రంగాల్లో ప్రస్తుతం ఉన్న విధానాలు సమీక్షించుకొని ముందుకెళ్లడం సహా అవసరమైన మార్పులు చేయడం ద్వారా మరింత వృద్ధిచెందడంపై సర్కార్ దృష్టిపెట్టింది.
ఈ మేరకు వివిధరంగాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్‌లతో పాటు సంబంధిత శాఖల అధికారులు, అనుభవజ్ఞులతో మేధోమథనం నిర్వహిస్తున్నారు. కీలకమైన వ్యవసాయం, అనుబంధరంగాలతోపాటు పారిశ్రామిక, ఐటీ రంగాలపై ఇప్పటికే సమావేశాలు ముగిశాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల ద్వారా అధిక వృద్ధి, మరింత ఉపాధి కల్పనతో పాటు ప్రైవేట్ పెట్టుబడులకు దోహదపడేలా విధానాల్లో చేయాల్సిన మార్పులపై చర్చించారు.