బీసీలకు అందాల్సిన రాజ్యాంగ ఫలాలు అగ్రకుల నాయకులే దండుకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు' అనే అంశంపై సదస్సు నిర్వహించింది ఓబీసీ ఐక్యవేదిక. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయంగా రావాల్సిన వాటాకు భిన్నంగా నామమాత్రంగా సీట్లు కేటాయిస్తూ కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు.
'అన్ని రంగాల్లో మార్పు... బీసీల్లో మాత్రం నిల్'
సమాజంలో అన్ని రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నా... బీసీల స్థితిగతుల్లో మాత్రం మార్పు రాకపోవడం విచారకరమన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగడానికి చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టే వరకు రాజీలేని పోరాటం చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీసీలు జనాభా ప్రాతిపదికన తమ వాట సాధించడంతోపాటు ఉద్యోగ రంగంలోనూ రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.