NVSS Prabhakar on Pending Bills Issue: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ఏడు అడుగులు వేసి రాజ్‌భవన్‌కి వెళ్తే.. బిల్లులు ఆమోదం పొందేవని అన్నారు. ఏడు అడుగులు వేసే ఓపిక.. తీరిక సీఎంకు లేకుండా పోయిందని మండిపడ్డారు. రాజకీయం చేయాలనే దురుద్దేశంతో బిల్లులపై సుప్రీం కోర్టుకు వెళ్లారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మద్యం కుంభకోణానికి రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందాలని: గ్యాస్ ధరలు పెంచారని సిలిండర్లతో మంత్రులు ఆందోళనలు చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, నీటి బిల్లులు పెంచినా వాడకుండా మంత్రులుంటారా అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు చెబితేనే అరెస్టు చేస్తారంటా.. ఇక విచారణ సంస్థలు ఎందుకని కేసీఆర్ కుమార్తె కవిత మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కవిత మద్యం కుంభకోణంలో పెట్టుబడిదారీ, మధ్యవర్తి అని దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోందని అన్నారు. మద్యం కుంభకోణానికి రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందాలని కవిత చూస్తున్నారనీ ప్రభాకర్ ఆరోపించారు.
మహిళా సాధికారత గురించి మాట్లాడటం సిగ్గు చేటు:సొంత పార్టీలో మహిళా ప్రజా ప్రతినిధులు కన్నీరు పెట్టుకుంటే పట్టించుకోని కవిత.. మహిళా సాధికారత గురించి మాట్లాడటం సిగ్గు చేటని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, అవమానాలు జరిగినా.. గవర్నర్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కవిత స్పందించలేదని గుర్తుచేశారు. కానీ కవిత మాత్రం మహిళల కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
"ప్రగతిభవన్ నుంచి ముఖ్యమంత్రి ఏడు అడుగులు వేస్తే రాజ్‌భవన్ వస్తుంది. గవర్నర్‌ను కలిసి వివరాలు తెలియజేస్తే బిల్లులు ఆమోదం పొందేవి. ఏడు అడుగులు వేసే ఓపిక, తీరిక సీఎంకు లేకుండా పోయింది. సంప్రదాయానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. రాజకీయం చేసేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది." - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు