NVSS Prabhakar allegations: దేశంలోని గర్భిణీలు, మహిళలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రవేశపెట్టిన అనిమీయా ముక్త్ భారత్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగారుస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. కోటి పది లక్షల మందుల స్ట్రిప్స్, వైద్య పరికరాలని సేకరించే టెండర్లలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు విరుద్ధంగా టీఎస్‌ఎంఐడీసీ వ్యవహరించిందని ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియాను తుంగలో తొక్కి ఇతర దేశాల నుంచి వైద్య పరికరాలు, మందులను దిగుమతి చేసుకున్నారని జూమ్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.
ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం రూ.రెండు కోట్లను స్వాహా చేసిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై విచారణ జరపాలని సీబీఐకి, విజిలెన్స్ కమిషన్‌కి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ముడుపులు ముట్టడంతోనే టెండర్లను రద్దు చేయడంలేదని విమర్శించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి పాత్ర కూడా ఉందని ఆరోపించారు. తక్షణమే టెండర్లను రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.