‘‘న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిళ్లు, ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఆర్.లక్ష్మణన్ సంతాప సభలో శనివారం వీడియో ద్వారా ఆయన మాట్లాడారు. ‘‘ఒక వ్యక్తి మంచి జీవితం కొనసాగించాలంటే ఎన్నో గుణాలను అలవరచుకోవాలి. వినయం, ఓర్పు, దయ, కచ్చితమైన కార్యాచరణ, నిరంతరం నేర్చుకుంటూ తనను తాను మెరుగుపరచుకోగలిగే ఉత్సాహం వంటి లక్షణాలను కలిగి ఉండాలి. అన్నింటికంటే ముఖ్యం.. ప్రత్యేకించి న్యాయమూర్తులు తమ విలువలకు బలంగా కట్టుబడి ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో నిర్భయంగా ఉండాలి.
"ప్రజల విశ్వాసమే న్యాయవ్యవస్థకు ఉన్న గొప్ప బలం. నమ్మకం, ఆమోదయోగ్యతలు బలవంతపెడితే రావు. వాటిని సంపాదించుకోవాలి. మన విలువలే మనకున్న గొప్ప సంపద. వాటిని ఎప్పుడూ మరిచిపోకూడదు. న్యాయవ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉన్న బార్ బెంచ్‌లు కలిసి.. మనకు సమర్థత, నిబద్ధత, నిర్భీతితో కూడిన స్వతంత్ర వ్యవస్థను వారసత్వ సంపదగా ఇచ్చాయని జస్టిస్ లక్ష్మణన్ అన్న మాటలను మనమంతా గుర్తుంచుకోవాలి. ఆయన మాటల నుంచి మనం స్ఫూర్తిని పొంది ప్రస్తుత సమయంలో అత్యవసరమైన శక్తిమంతమైన స్వతంత్ర న్యాయవ్యవస్థ కోసం పాటుపడాలి’’ అని జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.