nutrition kits distribution from today : గర్భిణీల పాలిట రక్తహీనత శాపంగా మారుతున్న వేళ తెలంగాణ సర్కారు.. గర్బిణీల ఆరోగ్యం కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాతా శిశు సంరక్షణలో భాగంగా తీసుకువచ్చిన కేసీఆర్ కిట్ ఇచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. గర్భిణీల్లో రక్తహీనత నియంత్రణ కోసం తాజాగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా రక్తహీనత నమోదవుతున్న తొమ్మిది జిల్లాలను ఎంపిక చేసి ఈ రోజు నుంచి ఆయా జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి చేయనుంది.
ఈ మేరకు ఉప్పటికే కిట్ లను జిల్లాలకు పంపిణీ చేసింది. సుమారు 50 కోట్ల రూపాయలను వెచ్చించి సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.25 లక్షల మంది గర్భిణీలకు లబ్ది చేకూరనుంది. రక్తహీనత ఎక్కువగా నమోదవుతున్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లలో బుధవారం కిట్ల పంపిణీ చేపట్టనుంది. ఆయా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కిట్ ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
ఇక కామారెడ్డి కలెక్టరేట్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వర్చువల్ గా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గర్భిణీల కోసం రూపొందించిన ఒక్కో కిట్ విలువల 1962 రూపాయలు కాగా... ఒక్కో కిట్ లో ఒక కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, ఒక కేజీ ఖర్జూర, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండజోల్ టాబ్లెట్, ఒక కప్పుని ప్లాస్టిక్ బాస్కెట్ లో పెట్టి అందించనున్నారు.