Numaish Exhibition : కొవిడ్ ఉద్ధృతితో అర్ధాంతరంగా ఆగిపోయిన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన- నుమాయిష్... రేపటి నుంచి (శుక్రవారం) పున ప్రారంభం కానుంది. హైదరాబాద్ నాంపల్లి మైదానంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్.. 45 రోజుల పాటు కొనసాగాల్సి ఉండగా ఒమిక్రాన్ ఉద్ధృతితో నిలిపివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశించింది.
అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోవటం, పరిస్థితులు అదుపులోకి రావటంతో.. ఈనెల 25 నుంచి నుమాయిష్‌ను తిరిగి నిర్వహించాలని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్ణయించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని సొసైటీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 25 నుంచి 46 రోజుల పాటు పారిశ్రామిక ప్రదర్శన కొనసాగనుంది. ఇప్పటికే ఎగ్జిబిషన్ సొసైటీ ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపుగా 1,400 స్లాళ్లు ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఎట్టకేలకు నుమాయిష్ తిరిగి ప్రారంభం అవుతుండటంతో ఇటు హైదరాబాద్ నగరవాసులు, వస్త్ర, వాణిజ్య వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.