Numaish 2022 closed: రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తున్న తరుణంలో అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన(నుమాయిష్)ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అదిత్యమార్గం తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నుంచి సొసైటీకి నోటీసులు కూడా వచ్చాయని ఆయన వెల్లడించారు. పాలక వర్గం అత్యవసర సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 1న అట్టహాసంగా ప్రారంభమైన నుమాయిష్ అర్ధాంతరంగా వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే ప్రజల సందర్శనను నిలిపేసిన నిర్వాహకులు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
డబ్బులు తిరిగి చెల్లిస్తాం
నుమాయిష్ రద్దు అయినప్పటికీ దుకాణాలు యజమానుల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లిస్తామన్నారు. ఇప్పటికే కొంతమంది యజమానులు తమ డబ్బులు ఇవ్వకపోయినా వచ్చే ఏడాదికి తిరిగి దుకాణాలు పెట్టుకుంటామని వారు కోరినట్లు తెలిపారు. వారి కోరిక మేరకు వచ్చే నుమాయిష్లో అవకాశం కలిపిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదే విధంగా వారం రోజుల పాటు మైదానంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొవిడ్ టీకా కేంద్రంంతో పాటు లయన్స్ క్లబ్ సహకారంతో భోజన ఏర్పాట్లు చేస్తున్నామని అదిత్యమార్గం స్పష్టం చేశారు.
నిర్వాహకులకు పోలీసుల నోటీసులు
Nampally Exhibition: నుమాయిష్ మూసివేయాలని నిర్వాహకులకు పోలీసులు నోటీసులిచ్చారు. కొవిడ్ వ్యాప్తి వల్ల నుమాయిష్ మూసివేయాలని హైదరాబాద్ సీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఈ సంవత్సరం నుమాయిష్ మూసివేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అదిత్యమార్గం