NTR POLITICAL JOURNEY : 1983 జనవరిలో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఎన్టీఆర్.. కాంగ్రెస్ నీచ రాజకీయాన్ని పసిగట్టలేక.. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే మరి అప్పుడేం చేశారు? అనే సందేహం రావొచ్చు. రాష్ట్రంలో ఓడిపోయినా.. తెలుగు దేశాధిపతిగా దేశంలో గెలిచారు. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించారు. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఒకే వేదిక మీదికి తెచ్చి.. జనతా ప్రయోగం విఫలమయ్యాక తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఓడిపోయిన.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర: ఎన్టీ రామారావు 1989లో ఓడిపోయాడు సరే? అప్పుడేం చేశాడు? ఎందరికి తెలుసు? ఓటమితో రగిలారా? ఎందుకొచ్చానీ రాజకీయాల్లోకి అని అనుకున్నారా? అదేం కాదు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఫెడరలిజానికి పెడరెక్కలు విరిచి.. అభివృద్ధిలో పరుగెత్తమనే తరహా విధానాలను నిరసించారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని ప్రధాని ఇందిరా గాంధీతోనే వాదించారు.. ఒప్పించారు.
ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రులు కావడానికి తన వంతు సహకారం: కేంద్ర రాష్ట్రాల అధికారాలను పున: సమీక్ష కోసం నాడు ఎన్టీఆర్.. ప్రతిపక్షాలు, రాజ్యాంగ నిపుణులతో ఒత్తిడి తెచ్చారు. చిట్టచివరకు యూనియన్ ప్రభుత్వం సర్కారియా కమిషన్‌ను నియమించింది. అంతకు ముందే ప్రతిపక్షాలను ఒక్కటిగా చేసి శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీ అధినేతలు.. ముఖ్యమంత్రులు కావటానికి తన వంతుగా వెళ్లి ప్రచారం చేశారు.
ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చిన మహనీయుడు: 1983లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రామకృష్ణ హెగ్డేకి మద్దతుగా, 1984లో ఎంజీఆర్‌కు, 1987లో హర్యానాలో దేవీలాల్‌కు, 1988 శాసన సభ ఎన్నికల్లో కరుణానిధికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన అన్ని సందర్భాల్లో వారు గెలిచారు. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించే ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటి మీదకు తెచ్చారు. జాతీయ పార్టీలను కలిపి నడిపారు. ఆయన కృషి ఫలించి 1989లో కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ గెలిచింది. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధాని అయ్యారు.
సమావేశం బహిష్కరణ.. దెబ్బతిన్న ఇందిరా గాంధీ అహం: గట్స్ ఉన్నాయా అని మాట్లాడటం ఇప్పుడో ఫ్యాషనైంది. నిజంగా గుండె ధైర్యం గురించే చెప్పాలంటే ఎన్టీరామారావు తర్వాతనే ఎవరైనా. ఎన్టీఆర్ తొలిసారి దేశమంతటినీ ఆకర్షించిన ఒక సంఘటనను ప్రస్తావించాలి. ఇది 1984 ఆగస్టు సంక్షోభానికి ముందు జరిగింది. ప్రధాని ఇందిరా అధ్యక్షతన ఏర్పాటైన జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాల్గొన్నారు. కశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అక్రమంగా కూలదోసినందుకు నిరసనగా తాను సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పి బయటికి నడిచారు. దాంతో ఇందిరా అహం దెబ్బతిన్నది. తనను ఎదిరించిన ఎన్టీఆర్ మీద కక్ష గట్టారు. ఎన్టీఆర్ గెలుపునే జీర్ణించుకోలేని ఇందిరా గాంధీ.. ఈ చర్యతో మరింత ఆగ్రహానికి లోనయ్యారు.
రాజ్యాంగేతర శక్తుల నియంత్రణకు ఏకమైన టీడీపీ : 1994లో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎన్టీఆర్ ప్రభంజనం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. 1995లో కొన్ని పరిణామాలతో ఎన్టీఆర్ పదవిని కోల్పోయారు. రాజ్యాంగేతర శక్తుల నియంత్రణకు పార్టీ ఏకమైంది. కుటుంబమంతా పార్టీకి మద్దతుగా నిలిచింది. ఈ పరిణామాలతో ఎన్టీఆర్ పదవిని కోల్పోయారు. కుటుంబం మద్దతుతో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. స్వయం కృషితో 1999 ఎన్నికల్లో టీడీపీని గెలిపించారు.
ఇదిలా వుంటే.. ఎన్టీఆర్ తొలి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మనదేశం'లో పోలీస్ ఆఫీసరు పాత్ర.. సత్యాగ్రహులను అరెస్టు చేసిన చేతులు. 'నేనింతవాడిని కావాటానికి ఎంత కష్టపడ్డానో తెలుసా' అనే డైలాగ్ ఉంది. అది అక్షరాలా ఆయన జీవితానికి సరిపోతుంది.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం ఏర్పాటు: 1986లో హైదరాబాద్‌లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నెలకొల్పారు. 1986 ఏప్రిల్ 9న విజయవాడలో హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అన్ని వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందికి తెచ్చి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. నవంబర్ 1 నుంచి అది ప్రారంభమైంది.