NTR Trust Help to Covid and Cyclone Victims: పేద ప్రజలకు, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడమే లక్ష్యంగా ఏర్పాటై 24 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో విశేష సేవలందిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.. 2021లోనూ ఆపన్నులను ఆదుకోవడంలో అన్ని విధాలా ముందుందని ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి కె.రాజేంద్రకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఎన్టీఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా 1997లో తెదేపా అధినేత చంద్రబాబు నెలకొల్పిన ట్రస్ట్‌కి నారా భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉత్పాదకత, ఉత్సాహం, ఆరోగ్యం, ఆత్మ విశ్వాసం ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి రంగంలోనూ తొణికిసలాడేలా శక్తివంతమైన సగర్వ సమాజాన్ని సాకారం చేయడమే ట్రస్టు లక్ష్యం’’ అని పేర్కొన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో 2021లో నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాలను ఆయన వివరించారు.
- గ్రామీణ ప్రాంతాల్లో 37 వైద్య శిబిరాలు నిర్వహించి, 4 వేల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేసింది.
- హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోని రక్తనిధి కేంద్రాల ద్వారా 201 రక్తదాన శిబిరాలు నిర్వహించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 52 వేల మంది ప్రాణాలను కాపాడింది.
- నిరుపేదలకు 2,881 యూనిట్లు, తలసీమియా బాధితులకు 774 యూనిట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు 6,739 యూనిట్ల రక్తాన్ని ఉచితంగా అందజేసింది.
- చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు 50 వేల మందికిపైగా బాధితులకు పాలు, తాగునీరు, ఆహారం, బ్రెడ్, బిస్కట్లు, దుప్పట్లు, మందులు అందజేసింది. కొన్ని ప్రాంతాల్లో ట్రస్ట్ వాలంటీర్లు ప్రాణాలకు తెగించి మరీ బాధితుల్ని కాపాడారు.
- విపత్తులో చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున రూ.48 లక్షల సాయం అందించింది.
- కొవిడ్ మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో ‘మీతోనే-మీకోసం’ పేరుతో సహాయ కేంద్రాన్ని నిర్వహించింది. 1,500 మంది కరోనా రోగులకు ఉచిత చికిత్స అందజేసింది. రూ.29 లక్షల విలువైన మందులను పంపిణీ చేసింది. రూ.1.3 కోట్ల వ్యయంతో ఏపీలో రెండు, తెలంగాణలో ఒక ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పింది.
- హైదరాబాద్‌లోని గండిపేట, ఏపీలో కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో ట్రస్ట్ నిర్వహిస్తున్న స్కూళ్లలో 227 మంది అనాథ పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తోంది.
- వేరే కాలేజీల్లో చదువుతున్న 194 మంది పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేసింది.
- ఏపీలో లక్షల మంది ప్రజలకు కేవలం రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత తాగునీరందిస్తోంది.