Nandamuri Taraka Ratna: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు సినీనటులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తమ కుటుంబసభ్యులతో ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, ఇతర కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దకు వెళ్లారు.
బెంగళూరు చేరుకున్న అనంతరం ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తారకరత్న కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్ కూడా నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.