జేఈఈ మెయిన్ జరిగిన ప్రతిసారీ జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ).. విద్యార్థులను తిప్పలు పెడుతూనే ఉంది. సర్వర్లు పనిచేయక.. కంప్యూటర్లు ఆన్ కాక తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద గంటల తరబడి వేచిచూస్తూ ఆందోళనకు దిగిన సందర్భాలు గత రెండేళ్లుగా ఎన్నో. ఈ సారి ఆ సమస్యతోపాటు కొత్తగా కవల అభ్యర్థులకు ఎన్‌టీఏ షాక్ ఇచ్చింది. కవలల్లో ఒక్కరికే హాల్‌టికెట్ జారీ చేసింది. దీంతో మరొకరు పరీక్ష రాయలేకపోయారు.
హైదరాబాద్ మారేడుపల్లి శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ముగ్గురు కవలలు(అంటే మొత్తం ఆరుగురు) మెయిన్‌కు దరఖాస్తు చేయగా.. వారిలో ముగ్గురికే ఎన్‌టీఏ హాల్‌టికెట్లు ఇచ్చింది. శ్రియ, శ్రీజ అనే కవల విద్యార్థుల్లో శ్రీజకు హాల్‌టికెట్ రాలేదు. బి.సాయి కౌశిక్, సాయి కార్తీక్‌లలో ఒకరికి.. అనిరుధ్, కీర్తిలలో ఒకరికి హాల్‌టికెట్ అందకపోవడంతో వారు పరీక్షలు రాయలేకపోయారు. విజయవాడలోనూ ఇలాగే ఇద్దరు పరీక్షలు రాయలేకపోయారని శ్రీచైతన్య విద్యాసంస్థల ఐఐటీ జాతీయ కోఆర్డినేటర్ ఎం.ఉమాశంకర్ చెప్పారు. నానో అకాడమీ డైరెక్టర్ కాసుల కృష్ణచైతన్య మాట్లాడుతూ.. గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోనూ పలువురు అభ్యర్థులు నష్టపోయారన్నారు.
స్పందించని అధికారులు:తమకు హాల్‌టికెట్ రాలేదని, తాము కవలలమని పలు ఆధారాలు చూపుతూ విద్యార్థులతోపాటు కళాశాలల డీన్లు కూడా ఎన్‌టీఏకు మెయిల్ పంపారు. ఫోన్లు చేసినా, మెయిల్ పంపినా ఒక్కరూ స్పందించలేదని శ్రీజ తల్లి మాధవి ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పిల్లలకు న్యాయం చేయాలని, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎన్‌టీఏ అధికారులతో మాట్లాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.