తెలంగాణ

telangana

ETV Bharat / state

NRIs Help to Villages : పల్లె ప్రగతికి ప్రవాస హారతి.. స్వగ్రామాలకు ఎన్‌ఆర్‌ఐల సొబగులు - తెలంగాణ వార్తలు

NRIs Help to Villages : ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఏ స్థాయికి ఎదిగినా.. మాతృభూమిపై మమకారాన్ని వీడలేదు. తమను ఇంతవారిని చేసిన సొంతూరి అభివృద్ధిలో తాము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. తమతో పాటు.. తమ పల్లె ప్రజలంతా బాగుండాలని, వారి జీవితాలూ మెరుగుపడాలని సేవలందిస్తున్నారు పలువురు ప్రవాసాంధ్రులు.

NRIs Help to Villages, villages developed in telangana
పల్లె ప్రగతికి ప్రవాస హారతి

By

Published : Jan 9, 2022, 6:37 AM IST

NRIs Help to Villages : బాగా చదువుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగి విదేశాల్లో స్థిరపడ్డ వాళ్లలో కొందరు జన్మనిచ్చిన తల్లినే కాదు.. జన్మభూమి రుణం కూడా తీర్చుకుంటున్నారు. పుట్టిన నేలను మరిచిపోకుండా.. విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ ఊరు, ఆ పల్లె ప్రజలంతా బాగుపడాలని సేవలందిస్తున్నారు.

ప్రపంచంలో అత్యధికంగా స్వదేశానికి డబ్బు పంపుతున్న వారిలో మొదటి స్థానంలో ఉన్నది భారతీయులే. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఒక్క 2020-21 సంవత్సరంలోనే స్వదేశానికి ప్రవాసులు పంపిన మొత్తం రూ.6.4 లక్షల కోట్లు.

పుట్టిన ఊరికి తోచిన సాయం

NRIs Help to Their Villages : కొందరు వ్యక్తిగత స్థాయిలో సాయం అందిస్తుండగా.. మరికొందరు ట్రస్టులు ఏర్పాటుచేసి వాటి పేరుతో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం కొంతమంది ప్రవాసాంధ్రులు నిధులు వెచ్చిస్తుండగా.. మరికొందరు విద్యార్థుల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇంకొందరు చిన్నతనంలో తాము చదువుకున్న బడికి కొత్తరూపు కల్పించి ఔదార్యం చాటుకుంటున్నారు. ఇంకొందరు ప్రవాసాంధ్రులైతే తమ సొంతూరిలోని ప్రజలకు ఇళ్లు నిర్మించి ఇవ్వటం, నిర్మాణానికి కొంత ఆర్థిక చేయూత అందించటం, ఎత్తిపోతల పథకాలు నిర్మించటం వంటివీ చేస్తున్నారు. మరి కొద్దిమందైతే ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల వంటివీ ఏర్పాటుచేశారు. తమ ఊళ్లోని అందరికీ తాగునీరు ఉచితంగా అందేలా ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో సేవలందిస్తూ కన్నభూమి రుణం తీర్చుకుంటున్నారు.

పల్లెల బాగు కోసం ప్రవాసులు

NRIs Develops Their Village : ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు ప్రాంతానికి చెందిన నెప్పల సుబ్బారాయుడు ఒక ఛారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటుచేసి 28 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదల కోసం పక్కా ఇళ్లు, ఊరికి ఎత్తిపోతల పథకం, పాఠశాలకు మౌలిక సదుపాయాలు, సిమెంటు రహదారులు, బస్సు షెల్టర్లు.. ఇలా అనేకం నిర్మించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన రామినేని అయ్యన్నచౌదరి, అనంతరం ఆయన కుమారుడు ధర్మప్రచారక్‌ రామినేని ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి భారీఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, సిమెంటు రోడ్లు, పశువైద్యశాల, ఓవర్‌హెడ్‌ట్యాంకు, పోలీసు కంట్రోల్‌రూం... ఇలాంటివి అందించారు. గురువులతో పాటు పలురంగాల ప్రముఖులకు పురస్కారాలు ఇస్తున్నారు. విజయవాడలోని సిద్దార్థ వైద్యకళాశాలలో చదివి, విదేశాల్లో స్థిరపడ్డవారు కలిసి ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటుకు సాయం చేశారు. అమెరికాలోని ఇన్ఫోవిజన్‌ సీఈవో యలమంచిలి సత్యశ్రీనివాస్‌ తన తల్లిపేరిట ట్రస్టు ఏర్పాటుచేసి, కృష్ణాజిల్లా యలమర్రులో విద్యార్థులకు ఉపకారవేతనాలతో చేయూతనిస్తున్నారు.

వివిధ రకాల అభివృద్ధి పనులు

నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రాంతానికి చెందిన డాక్టర్‌ ననమాల ప్రేమసాగరరెడ్డి పన్నెండేళ్లుగా పాఠశాల అభివృద్ధికి నిధులిస్తూ ఉన్నారు. గ్రామమంతా సీసీ రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి పథకం ఏర్పాటుచేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మోహన్‌ సుధీర్‌ పట్టా విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జలశుద్ధి కేంద్రం, నైపుణ్య శిక్షణ కేంద్రం, గ్రంథాలయం నిర్మాణాలతో పాటు.. పాఠశాలకు మరమ్మతులు చేయించారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన చెక్కపల్లి రమేష్‌ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు ప్రాంతానికి చెందిన గవిరినేని వెంకట సుబ్బారావు తన తండ్రి పేరుమీద ట్రస్టు ఏర్పాటుచేసి, చదువులకు సాయం చేస్తున్నారు. గుడ్లవల్లేరు మండలానికి చెందిన కానూరి మురళీదామోదర్‌ పాఠశాల అభివృద్ధికి నిధులిచ్చారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలానికి చెందిన పాపదేశి ప్రసాద్‌ తన తండ్రి పేరుతో ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి పిల్లలకు విద్యాసామగ్రి, గ్రామానికి వాటర్‌ ప్లాంటు తదితరాలు అందించారు.

ఇదీ చదవండి:Kerala cm meet KCR: దేశానికి భాజపా ప్రమాదకరం.. భావసారూప్యత కలిగిన పార్టీలతో త్వరలో సమావేశం

ABOUT THE AUTHOR

...view details